
సాక్షి, బెంగళూరు: గార్డెన్ సిటీ నడిమధ్యలోని గవర్నర్ అధికారిక నివాసం రాజ్‌భవన్ వద్ద పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఎన్నికల ఫలితాల్లో హంగ్ ఏర్పడటంతో.. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా నిర్ణయం కీలకంగా మారింది. అటు కాంగ్రెస్-జేడీయూల కూటమి, ఇటు బీజేపీ.. ఇద్దరూ గవర్నర్ అపాయింట్‌మెంట్‌ను కోరారు. అతిపెద్ద పార్టీగా అవతరించిన తమనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప డిమాండ్ చేయగా... ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉన్నందున తమనే పిలవాలని కాంగ్రెస్-జేడీయూ నేతలు కోరుతున్నారు. ఈ పరస్పర విరుద్ధప్రకటనల నేపథ్యంలో రాజ్‌భవన్ వద్ద కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేశారు. మంగళవారం మధ్యాహ్నం దాకా రాజ్‌భవన్ వద్ద సాధారణపరిస్థితులే ఉన్నా.. సాయంత్రానికి సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇరు వర్గాల అభ్యర్థనలను పరిశీలించిన తర్వాత గవర్నర్ ఏం నిర్ణయం తీసుకుంటారనేదానిపై ఉత్కంఠనెలకొంది. సిద్దరామయ్య రాజీనామా చేయడానికి వెళ్లినప్పుడు కూడా ఆయన కారును మాత్రమే లోనికి అనుమతించి, మిగతావాటిని రాజ్‌భవన్ గేటు బయటే నిలిపేయడం గమనార్హం.