6 రోజులు.. 31 సభలు

Telangana Elections 2018 KCR 31 Public Meetings In 6 Days - Sakshi

కేసీఆర్‌ ప్రచార షెడ్యూల్‌ సిద్ధం

19 నుంచి 25 వరకు షెడ్యూల్‌ ఖరారు

24న విరామం... అదే రోజు మేనిఫెస్టో?

తొలి దశలో 31 సెగ్మెంట్లలో ప్రచారం

ఒక్కోరోజు ఐదారు బహిరంగ సభలు

డిసెంబర్‌ 3న నగరంలో భారీ సభ

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం కూడా ముగింపు దశకు చేరుకోనుండటంతో టీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర్‌రావు ప్రచారానికి సిద్ధమయ్యా రు. ఈ నెల 19 నుంచి 25 వరకు ఎన్నిక ల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యలో ఒక్క రోజు (24న) మాత్రం షెడ్యూల్‌ ఖరారు చేయలేదు. ఆరు రోజుల్లో 31 నియోజకవర్గాల్లో నిర్వహించే సభల్లో కేసీఆర్‌ పాల్గొనేలా షెడ్యూల్‌ను రూపొందించారు. ఈ మేరకు తొలి దశ ప్రచార షెడ్యూల్‌ను శుక్రవారం విడుదల చేశారు. తొలిదశలో హైదరాబాద్‌ మినహా అన్ని ఉమ్మడి జిల్లాల్లో ప్రచారం చేయనున్నారు. ఇందుకోసం హెలికాప్టర్‌ సిద్ధమైంది. ఎన్నికల సంఘం సైతం హెలికాప్టర్‌ వాడకానికి అనుమతి ఇచ్చింది. సీఎం కేసీఆర్‌ కొన్ని సెగ్మెంట్లలో రోడ్డు షోలు నిర్వహించే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్పాయి. 

మేనిఫెస్టో ఎప్పుడు?
ఎన్నికల ప్రచారంలో కీలకమైన మేనిఫెస్టో ప్రకటనపై టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రజాకూటమి ఎన్నికల ఎజెండాను పరిశీలించాకే మేనిఫెస్టోను విడుదల చేసే ఉద్దేశంతో ఉన్నారు. అయితే ప్రచారం ప్రారంభించే ముందే మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేసీఆర్‌ మొదటి దశ ప్రచార షెడ్యూల్‌లో ఈ నెల 24న విరామం ఉంది. అదే రోజు మేనిఫెస్టోను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

ప్రచారంలో ఊపు తెచ్చేలా భారీ సభ... 
ఎన్నికల ప్రచారాన్ని సెప్టెంబర్‌ 7న ప్రారంభించిన సీఎం కేసీఆర్‌... నిజామాబాద్, మహబూబ్‌నగర్, వనపర్తిలో ఉమ్మడి జిల్లాల స్థాయి బహిరంగ సభలు నిర్వహించారు. వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లోనూ ఇవే తరహా సభలు నిర్వహించి తర్వాత నియోజకవర్గస్థాయి సభ లు నిర్వహించాలని ముందుగా నిర్ణయించారు. కూటమి అభ్యర్థుల ఖరారులో జాప్యం కారణంగా కేసీఆర్‌ వ్యూహం మార్చారు. నేరు గా నియోజకవర్గాల్లోనే బహిరంగ సభల్లో ప్రచారం చేయాలని నిర్ణయించారు. తొలి దశలోనే 25 శాతం నియోజకవర్గాల్లో ప్రచారం పూర్తి చేసేలా షెడ్యూల్‌ రూపొందించారు. ఎన్నికల ప్రచారంలో ఊపు తెచ్చేలా డిసెంబర్‌ 3న సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

నాయినికి కేసీఆర్‌ పిలుపు...
కోదాడ, ముషీరాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను కేసీఆర్‌ శనివారం ప్రకటించనున్నారు. ముషీరాబాద్‌ స్థానానికి ముఠా గోపాల్‌ పేరును ఇప్పటికే ఖరారు చేయగా మంత్రి నాయిని నర్సింహారెడ్డి తన అల్లుడు శ్రీనివాస్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయంపై చర్చించేందుకు రావాలని నాయినికి సీఎం కేసీఆర్‌ సూచించారు. శనివారం వారి భేటీ అనంతరం ముషీరాబాద్‌ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. కోదాడ సీటు విషయంలోనూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్‌రావు, నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి కె. శశిధర్‌రెడ్డి టికెట్‌పై ఆశతో ఉన్నారు. కాగా, టీఆర్‌ ఎస్‌ రెండో జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల కు మంత్రి కేటీఆర్‌ శుక్రవారం క్యాంపు కార్యా లయంలో బీ ఫారాలను అందజేశారు. 

మళ్లీ టీఆర్‌ఎస్‌లోకి గడ్డం అరవింద్‌రెడ్డి..
కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు మొదలయ్యాయి. మంచిర్యాల కాంగ్రెస్‌ టికెట్‌ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. శుక్రవారం ప్రగతి భవన్‌లో ఆయనకు సీఎం కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2009 ఎన్నికల్లో అరవింద్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలలకే కాంగ్రెస్‌కు సన్నిహితుడయ్యారు. 2010లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల రాజీనామాల నేపథ్యంలో అరవింద్‌రెడ్డి సైతం రాజీనామా చేశారు. ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లో చేరారు. ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. తాజాగా టికెట్‌ రాకపోవడంతో మళ్లీ టీఆర్‌ఎస్‌లో చేరారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top