టీడీపీలో టిక్కెట్ల లొల్లి

TDP Party Leaders Conflicts For Tickets in Local Elections Guntur - Sakshi

ఏళ్ల తరబడి పార్టీకి సేవ చేసిన వారికి అన్యాయం చేస్తున్నారని కార్యకర్తల ఆందోళన

గుంటూరు తూర్పు నియోజకవర్గం టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా

టిక్కెట్లు అమ్ముకుంటున్నారంటూ మండిపాటు

స్థానికులకు కాకుండా ఇతరులకు     కేటాయిస్తే ఓడిస్తామంటూ హెచ్చరిక

సాక్షి, గుంటూరు/కొరిటెపాడు(గుంటూరు): మున్సిపల్, కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో టీడీపీలో టికెట్ల లొల్లి తారాయి స్థాయికి చేరింది. కౌన్సిలర్‌లు, కార్పొరేటర్‌లుగా పోటీ చేయడానికి టికెట్‌ల కోసం తెలుగు తమ్ముళ్లు గొడవలకు దిగుతుంటే మరొకొన్ని చోట్ల అభ్యర్థులు కరవవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్, 7 మున్సిపాల్టీల ఎన్నికల నామినేషన్‌ల తుది గడువు శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో టికెట్‌లు ఆశించి భంగపడ్డ వారు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. గుంటూరు  కార్పొరేటర్లు టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఆ పార్టీ వీరవిధేయులు చాలా మంది ఆశించారు. అయితే వారికి టిక్కెట్‌లు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని టీడీపీ సీనియర్‌ నాయకుడు షేక్‌ మీరావలి ఆధ్వర్యంలో సుమారు 150 మంది కార్యకర్తలతో టీడీపీ తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి నసీర్‌ అహ్మద్‌ కార్యాలయం ఎదుట గురువారం ధర్నాకు దిగాడు. 30 సంవత్సరాల పాటు పార్టీకి సేవ చేసిన కార్యకర్తలను పరిగణలోకి తీసుకోవడం లేదని, టిక్కెట్లు అమ్ముకుంటున్నారంటూ మండిపడ్డారు. తూర్పు నియోజకవర్గంలోని 5వ డివిజన్‌ బీసీకి రిజర్వు అయింది. అయితే టీడీపీ నుంచి డివిజన్‌లో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందినవారిని కాకుండా వేరే డివిజన్‌లోని వారికి కేటాయించారంటూ స్థానిక టీడీపీ నాయకులు ఆందోళనకు దిగారు. స్థానికులకే టిక్కెట్‌ ఇవ్వాలని లేదంటే ఓడించి తీరుతామని హెచ్చరించారు. తన కార్యాలయం ఎదుట కార్యకర్తలు, నాయకులు ధర్నా చేస్తున్నా ఇన్‌చార్జి నసీర్‌ బయటికి రాలేదు. షేక్‌ మీరావలి మాట్లాడుతూ పార్టీ స్థాపించిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా పని చేస్తున్నామని, కనీసం తమ పేరును పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు.  

అభ్యర్థులు కరువు..  
సత్తెనపల్లి, మాచర్ల, చిలకలూరిపేట సహా పలు మున్సిపాలిటీల్లో టీడీపీ నుంచి పోటీకి ముఖ్య నాయకులు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి రాక టీడీపీ ఇన్‌చార్జిలు తలలు పట్టుకుంటున్నారు. కొన్ని మున్సిపాలిటీల్లో అన్ని వార్డుల్లో టీడీపీ బరిలోకి దిగడం కూడా కష్టంగా ఉందని ఆ పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు.  ద్వితీయ శ్రేణి నాయకులు పోటీకి ససేమిరా అంటుండటంతో పోటీలో ఉన్నాంలే అనిపించుకోడానికి  ఎవరో ఒకరిని బరిలో నిలుపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. 

ఓట్ల కోసం ఎర!
ఎన్నికల అనంతరం మేయర్‌ అభ్యర్థిని ప్రకటించనున్నట్టు ఇప్పటికే వైఎస్సార్‌ సీపీ స్పష్టం చేసింది. అయితే టీడీపీ అభ్యర్థిని ముందే ఖరారు చేయనున్నట్టు సమాచారం. అయితే మేయర్‌ అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రాలేదని తెలుస్తోంది. మాజీ ఎంపీ కోడలు, గుంటూరు నగర పార్టీ కీలక బాధ్యతలు చూస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త సతీమణి, ముస్లిం మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తిని, లేక ఇటీవల గుంటూరు నగరంలో పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టిన నాయకుడు.. వీరిలో ఎవరో ఒకరిని మేయర్‌ అభ్యర్థిగా ఎంపిక చేయాలనే దానిపై అధిష్టానం స్థాయిలో చర్చలు సాగుతున్నాయి. ముందే మేయర్‌ అభ్యర్థిని ప్రకటించి ఓ వర్గం ఓటర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతోనే టీడీపీ ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top