మరోసారి మాజీ మంత్రిగా...

TDP Ministers Ashok Gajapathi Raju and Y.S. Chowdary resign from Union Cabinet - Sakshi

కేంద్ర మంత్రి పదవికి అశోక్‌గజపతి రాజీనామా

అధిష్టానం ఆదేశంతో ప్రధానికి రాజీనామా లేఖ

హోదాపై ఒక్కనాడైనా నోరుమెదపని వైనం

సాక్షిప్రతినిధి, విజయనగరం: విజయనగరం రాజా... అశోక్‌గజపతి మరోసారి మాజీ మంత్రిగా మారనున్నారు. హోదాపై కేంద్ర వైఖరిని నిరసిస్తూ అధిష్టానం ఆదేశాల మేరకు ప్రధాని మోదీకి ఆయన రాజీనామా లేఖ అందించారు. దానిపై ఇంకా ఆమోదముద్ర పడాల్సి ఉంది. హోదా కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం మరోసారి ఉధృతమవుతోంది. మొదటినుంచీ అలుపెరుగని పోరా టం చేస్తున్న వైఎస్సార్‌సీపీపై జనంలో బలం పెరుగుతూ వస్తోంది. ఈ తరుణంలో తామూ హోదాకోసం పోరాడుతున్నామని చెప్పేందుకు తీసుకున్న తొలి నిర్ణయం కేంద్ర మంత్రుల రాజీనామా అస్త్రం. అందుకే ఇప్పటివరకూ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న అశోక్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది.

సుదీర్ఘ రాజకీయ చరిత్ర
రాజకీయ అరంగేట్రం అనంతరం 1978లో జనతాపార్టీ అభ్యర్థిగా విధాన సభకు ఎన్నికైన అశోక్‌ 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించినపుడు దానిలో చేరి 1983, 85, 89, 94, 99, 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించి శాసనసభ, పార్లమెంటు సభ్యునిగా పదవులు అలంకరించారు. అంతేనా... నాడు రాష్ట్ర మంత్రిగా... నేడు కేంద్ర మంత్రిగా కూడా ఎదిగారు. ఇన్నేళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో జిల్లా అభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదన్నదే ఆయన వ్యతిరేకుల వాదన.

హోదాపై స్పందించరే...
వాస్తవానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం ఏనాడూ అశోక్‌గజపతి డిమాండ్‌చేసింది లేదన్నదే ఇక్కడి వారి వాదన. కేంద్ర బడ్జెట్‌ తర్వాత జనంలో వచ్చిన వ్యతిరేకత చూసి కూడా అశోక్‌ గజపతిరాజు స్పందించలేదు. ఎంపీలతో సీఎం అమరావతిలో పెట్టిన సమావేశానికీ ఆయన హాజరు కాలేదు. ఢిల్లీలో టీడీపీ ఎంపీలు చేసిన ఆందోళనలోనూ పాల్గొనలేదు. తర్వాత ఇతర మంత్రులతో కలిసి కేంద్రంలోని పెద్దలను కలిసి వినతిపత్రం ఇచ్చినపుడే పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్‌ కేటాయింపులు చూసి టీడీపీ నేతలు బీజేపీపై విమర్శలు చేస్తున్నా అశోక్‌ మాత్రం ఒక్కమాట కూడా కేంద్రాన్ని అనలేదు.

ఇప్పుడు తప్పనిసరై పదవికి రాజీనామా చేసినప్పటికీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రం కొనసాగుతూనే ఉంటానని అశోక్‌ ప్రకటించారు. అంటే మంత్రి పదవిని వదలుకున్నప్పటికీ ఎంపీ పదవికి దూరం కాలేకపోతున్నారన్నమాట. పైగా ప్రత్యేక హోదా విషయంలో జరుగుతున్న అన్యాయానికి నిరసనగా రాజీనామా చేస్తున్నామని చెబుతునే అన్యాయం చేసిన వారితో కలిసి ఉంటామనడాన్ని రాజకీయ డ్రామాలుగా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.

నాలుగేళ్లలో అంతా శూన్యం
నాలుగేళ్లు కేంద్రంలో ఉండి జిల్లాకేమైనా తెచ్చుకోగలిగారా అంటే అదీ లేదు. బడ్జెట్‌లో భోగా పురం విమానాశ్రయానికి నిధులు తీసుకురాలేకపోయారు. వైద్య కళాశాలను సాధించుకురాలేకపోయారు. గిరిజన యూనివర్శిటీకి సరిపడా ని ధులు సంపాదించలేకపోయారు. ఇలా చెప్పుకోదగ్గ ఏ ఒక్క అభివృద్ధినీ నాలుగేళ్లలో చేసి చూ పించలేకపోయిన అశోక్‌ గజపతిరాజు ఇప్పుడు కొత్తగా పదవికి రాజీనామా చేయడం వల్ల ఒరిగేదేమీ లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top