జగ్గయ్యపేటలో మరో కుట్రకు తెరలేపిన టీడీపీ

TDP Conspiracy in Jaggaiahpet municipal chairman election, says samineni - Sakshi

సాక్షి, జగ్గయ్యపేట : జగ్గయ‍్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక వాయిదా పడటంతో టీడీపీ మరో కుట్రకు తెరలేపింది. ప్రలోభాలకు లొంగని వైఎస్‌ఆర్‌ సీపీ నేతల బెదిరింపులతో అదుపులోకి తెచ్చుకునేందుకు యత్నిస్తోంది. తమకు మద్దతు ఇవ్వకుంటే కేసులు తిరగదోడతామంటూ లీకులు ఇస్తోంది. పార్టీ ఫిరాయించి మద్దతిస్తే కేసులు మాఫీ చేస్తామని టీడీపీ సంకేతాలు పంపిస్తోంది. తాము చెప్పినట్లు వినకుంటే నలుగురు కౌన్సిరల్లను అరెస్ట్‌ చేస్తామని టీడీపీ నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక టీడీపీ నేతల హైడ్రామా నేపథ్యంలో జగ్గయ్యపేట మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక రేపటికి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఎన్నిక వాయిదాపై రిటర్నింగ్‌ అధికారి హరీశ్‌ మాట్లాడుతూ.....‘కౌన్సిల్‌లో చోటుచేసుకున్న పరిణామాలను ఈసీ దృష్టికి తీసుకెళ్తాం. ఈ రోజు కోరం ఉన్నా ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేదు. సర్దిచెప్పినా కొంతమంది సభ్యులు వినిపించుకోలేదు. రేపు ఉదయం ఎన్నిక నిర్వహిస్తాం.’ అని తెలిపారు.

మరోవైపు వైఎస్‌ఆర్‌ సీపీ నేత సామినేని ఉదయభాను మాట్లాడుతూ... మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక వ్యవహారంలో కావాలనే టీడీపీ నేతలు రాద్ధాంతం చేశారని అన్నారు. టీడీపీ నేతలు రిటర్నింగ్‌ అధికారిపై ఒత్తిడి తెచ్చి ఎన్నిక వాయిదా వేయించారని ఆయన ఆరోపించారు. కోరం ఉన్నా వాయిదా వేయడంలోని మతలబు ఏంటో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నెల రోజుల నుంచి ప్రలోభాలు, బెదిరింపులకు గురి చేస్తున్నా... తమ కౌన్సిలర్లు లొంగలేదన్నారు. అందుకే టీడీపీ నేతలు విధ్వంసం చేశారని మండిపడ్డారు. తమ పార్టీ కౌన్సిలర్లకు ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలని సామినేని ఉదయభాను డిమాండ్‌ చేశారు. కాగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ వైఎస్‌ఆర్‌ సీపీ నేతలు అంబేద్కర్‌ విగ్రహం వద్ద ఆందోళనకు దిగడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. నిరసనలో పాల్గొన్న సామినేని ఉదయభాను సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

టీడీపీ నేతల అరాచకం..
వైఎస్ఆర్‌సీపీకి మెజార్టి సభ్యులు ఉండటంతో ఎలాగైనా మున్సిపల్‌ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకోవాలని టీడీపీ నేతలు అరాచకానికి ఒడిగట్టారు. అధికారులు, ప్రతిపక్ష సభ్యులపై దౌర్జన్యం ప్రదర్శిస్తూ మున్సిపల్ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు. ఇద్దరు టీడీపీ మహిళ నాయకులను  కౌన్సిలర్‌గా చూపిస్తూ మున్సిపల్‌ హాలులోకి టీడీపీ నేతలు తీసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నేతల అసలు రంగు బయటపడటంతో కౌన్సిల్‌ హాలులోని టేబుళ్లను పడేశారు. వైఎస్ఆర్‌సీపీ ఇచ్చిన ఎన్నికల మెమోరండం పేపర్లను చించిపారేశారు.

అలాగే మున్సిపల్ ఆఫీసు ముందు పార్క్ చేసిన బైక్‌ను టీడీపీ నేతలు పెట్రోల్‌ పోసి తగులబెట్టారు. ఈ తతంగం అంతా సీసీ ఫుటేజ్‌లో రికార్డవడంతో తమ కౌన్సిలర్లు ఇద్దరు మాయమయ్యారంటూ ఎన్నిక వాయిదా వేయాలని పట్టుపట్టారు. ఈ గందరగోళంలో అధికారులు చైర్మన్ ఎన్నిక కాసేపు వాయిదా వేసినప్పటికి వ్యవహారం సద్దుమణగపోవడంతో ఎన్నికను రేపటికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఛైర్మన్ ఎన్నికల వాయిదా వేయడంపై వైఎస్ఆర్‌సీపీ కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రలోభాలతో మా కౌన్సిలర్లను టీడీపీ నేతలు కొనాలని చూశారని...కుదరకపోవడంతో ఎన్నిక వాయిదా వేయించారని మండిపడ్డారు. రేపు ఉదయం 11 గంటలకు మున్సిపల్ చైర‍్మన్‌ ఎన్నిక జరుగుతుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top