మాకు 170 మంది మద్దతుంది | Sakshi
Sakshi News home page

మాకు 170 మంది మద్దతుంది

Published Mon, Nov 4 2019 4:54 AM

Shiv Sena has support of over 170 MLAs in Maharashtra - Sakshi

సాక్షి ముంబై/ఔరంగాబాద్‌: ముఖ్యమంత్రి పీఠంపై రాజీపడేది లేదని శివసేన మరోసారి స్పష్టం చేసింది. తమకు 170 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించింది. ఆ పార్టీ నేత సంజయ్‌ రౌత్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి ఒప్పందం శివసేనతో జరగలేదంటూ ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ మాటమార్చడం వల్లనే బీజేపీతో చర్చలను నిలిపి వేశామన్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి పదవిని తాము వదిలేది లేదన్నారు. శివసేన అధికార పగ్గాలు చేపట్టేదీ లేనిదీ తొందరలోనే ప్రజలు తెలుసుకుంటారని ఆ పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే తెలిపారు.

అంతకు మించి వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. ఆదివారం ఆయన ఔరంగాబాద్‌లో మాట్లాడారు. నేడు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌పవార్, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యంలో ‘మహా’డ్రామా కొలిక్కివస్తుందని అంచనావేస్తున్నారు. పవార్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా     గాంధీతో, ఫడ్నవీస్‌ బీజేపీ చీఫ్‌ అమిత్‌షాతో భేటీకానున్నారు. దీంతో అందరి దృష్టీ దేశ రాజధానిపై ఉంది. ఈ నేపథ్యంలో ఉన్న ఐదు ప్రత్యామ్నాయాలను సామ్నా పత్రికలో రౌత్‌ వివరించారు.
 
శివసేనను తప్పించి అతిపెద్దపార్టీగా ఆవిర్భవించిన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రావచ్చు. బీజేపీ వద్ద 105 మంది ఎమ్మెల్యేలుండగా మ్యాజిక్‌ ఫిగర్‌ కోసం 40 మంది ఎమ్మెల్యేలు అవసరం ఉంది. దీంతో బలనిరూపణ సమయంలో ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది.  

2014 ఎన్నికల్లో మాదిరిగా బీజేపీకి ఎన్సీపీ మద్దతు ప్రకటించేందుకు అవకాశం ఉంది. ఇలా జరిగితే సుప్రియా సూలేకు కేంద్రంలో, అజిత్‌ పవార్‌కు రాష్ట్రంలో మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయి. కాని, అలాంటి అవకాశమే లేదని స్వయంగా శరద్‌ పవార్‌ చెబుతున్నారు.

బీజేపీ విశ్వాస పరీక్షలో నెగ్గకుంటే రెండో పెద్ద పార్టీగా శివసేన అధికారం కోసం ముందుకువచ్చే అవకాశాలున్నాయి. ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44 ఎమ్మెల్యేలతోపాటు ఇతరుల సాయంతో అవసరానికి మించి 170 వరకు సంఖ్యాబలం చేరవచ్చు. శివసేనకు ముఖ్యమంత్రి పదవి లభిస్తుంది. కానీ, మూడు వేర్వేరు సిద్ధాంతాలున్న పార్టీలతో ముందుకెళ్లడం అసాధ్యం.

బీజేపీ, శివసేన పంతం మాని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. ముఖ్యంగా శివసేన డిమాండ్లపై బీజేపీ ఆలోచించాల్సి ఉంది. సీఎం పదవిని విభజించాల్సి రావచ్చు. ఇది అత్యంత ఉత్తమ ప్రత్యామ్నాయం.  
అధికారాన్ని వాడుకుని, ప్రలోభాలకు గురి చేసి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకుని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. అయితే, ఫడ్నవీస్‌కు ప్రస్తుతం అదేమంత సులభం కాదని చెప్పవచ్చు.  

Advertisement
Advertisement