ఇంధన ధరలు - యూపీఏ విఫలం..!! : మోదీ

From Salman To Narendra Modi, Tweets About Rising Petrol Prices - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ‘ఇంధన ధరల్లో ఈ భారీ పెరుగుదల కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైందనడానికి సంకేతం. దీని ఫలితంగా గుజరాత్‌ రాష్ట్రంపై వందల కోట్ల అదనపు భారం పడుతుంది’ ఇది నేటి ప్రధాని నరేంద్ర మోదీ నాడు గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పటి మాట. ‘పెట్రోలు, డీజిల్‌ ధరల్లో పెరుగుదలతో సామాన్యుడి బతుకు మరింత దుర్భరం. ప్రజా జీవితాల పట్ల స్పందించే గుణం లేని యూపీఏ సర్కార్‌తో వాహన దారుల కష్టాలు రెట్టింపయ్యాయి’ ఇది నేటి విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ ఆవేదన.

‘పెట్రోలు ధర పెరిగిందని చింతించొద్దు. మీకు పశువుల పేడ ఫోటో పంపుతున్నా. దాంతో గోబర్‌ గ్యాస్‌ తయారు చేసుకోండి’ ఇది బాలీవుడ్‌ కండల వీరుడు నాడు కేంద్రంపై విసిరిన ట్వీట్‌. ఇలా యూపీఏ సర్కార్‌ పాలనలో పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలపై నేటి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుంచి బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ వరకు సగటు ఇంధన వినియోగ దారుడిపై చూపించిన జాలి. మరి గతంలో చేసిన ఈ ట్వీట్లపై వారు ఇప్పుడెలా స్పందిస్తారో చూడాలి..!!

రికార్డులకెక్కిన ఇంధన ధరలు..
కర్ణాటకలో ఎన్నికల సందర్భం‍గా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందేమోనని భావించిన కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌ ధరల జోలికి వెళ్లలేదు. ఆ ఎన్నికల అనంతరం పెట్రోలు, డీజిల్‌ ధరలకు రెక్కలొచ్చాయి. రికార్డు స్థాయిలో ధరలు పెరిగి వాహన దారుల జేబులకు చిల్లులు పెడుతున్నాయి. గడిచిన తొమ్మిది రోజుల్లో పెట్రోలు ధర రూ.2.24 పైసలు, డీజిల్‌ ధర రూ.2.15 పైసలు పెరిగి రికార్డు సృష్టించాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు 76.87 రూపాయలకు, లీటరు డీజిల్‌ 2.24 రూపాయలకు లభ్యమవుతోంది.

సామాన్యుడి నడ్డి విరిచేలా పెరిగిన ఈ ధరల నుంచి ఉపశమనానికి ఆయా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని ఒక పెట్రోలియం శాఖ ఉన్నతాధికారి అన్నారు. 20 నుంచి 35 శాతం అమ్మకం పన్ను విధిస్తున్న రాష్ట్రాలు ఆ విషయంగా ఆలోచించాలని ఆయన వెల్లడించారు. భారీగా పెరుగుతున్న ఇంధన ధరల నియంత్రణకు కేంద్రం చర్యలు తీసుకోనుందని ఆయన తెలిపారు. రూపాయి విలువ 16 నెలల కనిష్టానికి పడిపోవడం కూడా పెట్రోలు, డీజిల్‌ ధరల్లో అసాధారణ పెరుగుదలకు కారణమని ఆయన అన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top