పార్లమెంట్‌లో ఫస్ట్‌ టైం.. ఏం మాట్లాడతాడో?

Sachin to initiate debate in Rajya Sabha over Right to Play - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దాదాపు ఐదేళ్ల తర్వాత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తొలిసారి పార్లమెంట్‌లో గళం వినిపించబోతున్నాడు. గురువారం రాజ్యసభలో ఓ కీలక అంశంపై చర్చించబోతున్నాడు. విద్యార్థులకు ‘రైట్‌ టూ ప్లే’ అనే అంశంపై ఆయన ప్రసంగించబోతున్నారు. 

2012లో సచిన్ పెద్దల సభకు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన సభకు చాలా అరుదుగా హాజరవుతూ వస్తున్నారు. ఆయా సమయాల్లో కూడా చర్చల్లో పాల్గొనకుండా గప్‌ చుప్‌గా ఉంటున్నాడనే విమర్శలు వినిపించాయి కూడా. అయితే ఇప్పుడు తాను ప్రసంగించే అంశంపై స్వయంగా సచిన్ నోటీసు ఇవ్వటం విశేషం. రైట్‌ టూ ప్లే అండ్‌ ఫ్యూఛర్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఇన్‌ ఇండియా అనే అంశంపై సచిన్‌ సుదీర్ఘంగా ప్రసంగించనున్నాడు.

విద్యతోపాటు ఆటలు కూడా తప్పనిసరి చేయాలని.. అందుకు అవసరమైన వసతులను ప్రభుత్వమే కల్పించాలని సచిన్‌ మాట్లాడబోతున్నాడు. దీనికి బీజేపీ నేత రాజీవ్‌ సింగ్ జువేవ్‌, కాంగ్రెస్‌ నేత పీఎల్‌ పూనియా మద్దతు ఇస్తూ తమ పేర్లను కూడా నోటీసులో పేర్కొన్నారు. ఆటలకు దూరంగా ఉంటున్న విద్యార్థుల సంఖ్య నానాటికీ ఎక్కువైపోతుందని.. ఈ విషయంలో పురోగతి కోసం సచిన్‌ చేసిన ప్రతిపాదనకు తాము అంగీకరిస్తున్నామని వారిద్దరూ తెలిపారు. ఒకవేళ సచిన్‌ చేసిన ప్రతిపాదన చట్ట రూపం దాలిస్తే.. విద్యాహక్కు, సమాచార హక్కులకు సవరణలు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సచిన్‌ ప్రసంగం ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి నెలకొంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top