బీజేపీ ప్రభంజనం తట్టుకోలేకే!

Rivals opposition to me turning increasingly violent - Sakshi

హింసాత్మకంగా మారుతున్న విపక్షాల వ్యతిరేకత

వెనుకబడిన వర్గాలు గొప్పస్థానాల్లో ఉండటం వారికి నచ్చట్లేదు

బీజేపీ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ

న్యూఢిల్లీ: బలహీన వర్గాలకు చెందిన ఒక సామాన్యుడు, ఓ పేద మహిళ కుమారుడు దేశ ప్రధాని కావడాన్ని విపక్షాలు భరించలేకపోతున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. తనపై ప్రతిపక్ష పార్టీల వ్యతిరేకత హింసాత్మక రూపుదాలుస్తోందని మండిపడ్డారు. ‘మనపై వ్యతిరేకత మరింత తీవ్రంగా, ఆగ్రహంగా మారుతుండటం మీరు చూస్తున్నారు. ఇప్పుడు అది హింసాత్మకంగా మారుతోంది. మనం తప్పులు చేశామని కాదు వారి కోపం. రోజురోజుకీ బీజేపీ బలపడుతుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు’ అని వ్యాఖ్యానించారు.

బీజేపీ 38వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ నాయకులనుద్దేశించి మోదీ ప్రసంగించారు. దళిత సంఘాల ఇటీవలి భారత్‌బంద్‌ హింసాత్మకమైన నేపథ్యంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘బీజేపీ వరుసగా ఒక్కో రాష్ట్రంలో గెలుస్తోంది. దీంతో మోదీని తొలగించాలి. ఆయన కుర్చీని లాక్కోవాలి అని కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షం ప్రయత్నిస్తోంది. అందుకే ఒకటి తర్వాత ఒకటిగా అవాస్తవాలను ప్రచారం చేస్తోంది’ అని విమర్శించారు.

‘బీజేపీ పేదల పార్టీగా మారడాన్ని పార్టీ నుంచి అత్యధిక సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికవడాన్ని విపక్షం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే ఈ హింసాత్మక వ్యతిరేకత’ అని పేర్కొన్నారు.పార్లమెంటు సమావేశాల సందర్భంగా కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యం పీకనొక్కేసిందని, ప్రజాతీర్పును అవమానించిందని మోదీ మండిపడ్డారు. కాంగ్రెస్‌ తీరు కారణంగా పార్లమెంటు గౌరవం అత్యంత దైన్యస్థితికి చేరిందన్నారు. విపక్షాల తీరుకు నిరసనగా పార్లమెంట్‌ ఆవరణలో ఏప్రిల్‌ 12న ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టాలని పార్టీ ఎంపీలను ఆదేశించారు.

ఏడు పథకాలతో ప్రజల్లోకి
బీజేపీ ఎంపీలు గ్రామాలకు వెళ్లి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించాలని మోదీ సూచించారు. హరిజనులు, గిరిజనుల కోసం  తీసుకొచ్చిన 7 కీలకమైన సంక్షేమ పథకాలు, వాటి అమలును వివరించాలన్నారు. సంఘసంస్కర్త జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 11ను సమతా దివస్‌ (సమానత్వ దినోత్సవం)గా జరపనున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌ 14 నుంచి మే 5 వరకు ‘గ్రామ స్వరాజ్‌ అభియాన్‌’ను పార్టీ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తూ.. గ్రామాల కోసం కేంద్రం తీసుకొచ్చిన జన్‌ధన్‌ యోజన, ఉజ్వల తదితర 7 సంక్షేమ పథకాలను బీజేపీ ప్రజాప్రతినిధులు ప్రచారం చేయాలన్నారు.  

సామాజిక మాధ్యమం ద్వారా..
సాంకేతికతను వాడి సామాజిక మాధ్యమం ద్వారా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు మోదీ సూచించారు. ‘సామాజిక మాధ్యమంలో మనం క్రియాశీలకంగా లేకపోతే దోశద్రోహ, సంఘ విద్రోహ శక్తులు స్థానాన్ని సంపాదించుకుంటాయి’ అని అన్నారు. ఢిల్లీలో శివాజీపై జరుగుతున్న నాటకాన్ని చూడాలని పార్టీ ఎంపీలను కోరారు. 30 ఏళ్ల క్రితం ఈ నాటకాన్ని చూసేందుకు తను గుజరాత్‌ నుంచి పుణేకు వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. కాగా, బీజేపీ యావద్భారతీయుల పార్టీ అని కేంద్ర మంత్రి రవిశంకర్‌  పేర్కొన్నారు. నమో యాప్‌ ద్వారా ప్రసంగించిన మోదీ.. పార్టీ పదాధికారుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.  

ఏప్రిల్‌ 9న కాంగ్రెస్‌ నిరాహార దీక్షలు
పార్లమెంటు వాయిదాలకు కాంగ్రెస్‌ కారణమంటూ బీజేపీ ఎంపీలు పార్లమెంటు ఆవరణలో ఏప్రిల్‌ 12న నిరాహార దీక్ష చేయాలనే నిర్ణయానికి ప్రతిగా ఏప్రిల్‌ 9న కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా ఒకరోజు నిరాహార దీక్షలకు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ పిలుపునిచ్చారు. అన్ని రాష్ట్రాలు, జిల్లా కార్యాలయాల ముందు కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఒక్కరోజు నిరాహార దీక్షలు చేయాలని.. వివిధ అంశాలపై బీజేపీ చెబుతున్న అవాస్తవాలను బట్టబయలు చేయాలని ఆయన పేర్కొన్నారు.

కార్యకర్తల శ్రమ.. ప్రజాశీర్వాదంతోనే...
ప్రజల ఆశీర్వాదాలు, కార్యకర్తల  నిరంతర శ్రమ కారణంగానే బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని మోదీ అన్నారు. పార్టీ నిర్మాణంలో అసువులు బాసిన నేతలకు నివాళులర్పించారు. పార్లమెంటరీ సమావేశ వివరాలను మంత్రి అనంత్‌  చెప్పారు. బీజేపీ ఎంపీలు ప్రజలకు ఈ విపక్షాలు చేస్తున్న కుట్రలను వివరించాలన్నారు. ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్‌ యాత్ర’ను దేశవ్యాప్తంగా చేపట్టాలని పార్టీ యోచిస్తోంది.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top