సచివాలయ కూల్చివేతను అడ్డుకుంటాం : రేవంత్‌

Revanth Reddy Fires On CM KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూఢనమ్మకాల పిచ్చితో సచివాలయాన్ని కూల్చివేస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న సచివాలయం ఆధునిక పరిజ్ఞానంతోనే నిర్మించారని, 100 ఏళ్లు కోసం కట్టిన సచివాలయంలో ఏ భవనం కూడా 30 ఏళ్ల కంటే ఎక్కువ ఉపయోగించలేదన్నారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ తన మూఢ నమ్మకాల కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ. వెయ్యి కోట్ల విలువైన భవనాలను కూలగొడుతున్నారని విమర్శించారు. కొత్త సచివాలయాన్ని నిర్మిస్తానన్న కేసీఆర్‌ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఒప్పుకోదన్నారు.

తెలంగాణ వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా అమరవీరుల స్మారకానికి పునాదిరాయి పడలేదు కానీ, ఉన్న సచివాలయాన్ని కూలగొట్టి కోట్ల ఖర్చుతో కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల భవిష్యత్తు కోసం నూతన విధ్యాభవనాలు నిర్మించాలన్నారు. సచివాలయాన్ని కూల్చడంపై న్యాయస్థానంలో ప్రజావ్యాజ్యం వేశానన్నారు. సచివాలయ భవనాల కూల్చివేతను కాంగ్రెస్‌ పార్టీ అట్టుకుంటుందన్నారు. తమతో కలిసి వచ్చే పార్టీలు, ప్రజాసంఘాలను కూడగట్టి ఉద్యమిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు భవనాల కూల్చివేతను అడ్డగించేందుకు పెద్దఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top