టీఆర్‌ఎస్‌పై పోరు ఉధృతం చేయండి | Rahul Gandhi to participate in Congress bus yatra | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌పై పోరు ఉధృతం చేయండి

Apr 21 2018 1:20 AM | Updated on Apr 21 2018 10:08 AM

Rahul Gandhi to participate in Congress bus yatra - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేయాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆదేశించారు. శాసనసభ్యత్వాల రద్దు వ్యవహారంలో హైకోర్టులో ఊరట పొందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌తోపాటు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేతలు మర్రి శశిధర్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌లు శుక్రవారం ఢిల్లీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ కుంతియా ఆధ్వర్యంలో రాహుల్‌ను కలిశారు.

తమ సభ్యత్వాలను రద్దు చేసిన తీరు, హైకోర్టులో విజయం సాధించిన పరిణామాలపై రాహుల్‌కు వివరించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కోమటిరెడ్డి, సంపత్‌ కృషి చేశారంటూ రాహుల్‌ వారిని ప్రత్యేకంగా అభినందించారు. కోమటిరెడ్డిని ఆలింగనం చేసుకుని అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేసి వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలని ఈ బృందానికి సూచించారు.

ఈ భేటీ అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ నియంతృత్వ పోకడలను అవలంబిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్‌ మధుసూదనాచారి తమ పదవులకు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. ‘‘కోర్టు తీర్పును రాహుల్‌గాంధీకి వివరించాం. ప్రజాస్వామ్య పరిరక్షణకు రాష్ట్రంలో కాంగ్రెస్‌ చేసిన కృషిని ఆయన అభినందించారు. టీఆర్‌ఎస్‌ సర్కారుపై ఏ స్థాయిలోనైనా పోరాటం ఉధృతంగా ఉండాలన్నారు. బస్సు యాత్రలో రాహుల్‌ గాంధీ కూడా రెండు రోజులు పాల్గొంటారు’’అని ఉత్తమ్‌ వివరించారు.

హైకోర్టు తీర్పు తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణకు దోహదపడుతుందని కుంతియా పేర్కొన్నారు. కోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం గౌరవించాలని ఆయన సూచించారు. గ్రూపులకు అతీతంగా పోరాడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని కోమటిరెడ్డి అన్నారు. ‘‘శాసనసభను అవమానించిందే టీఆర్‌ఎస్‌ పార్టీ’’అని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పు స్ఫూర్తితో అన్ని విషయాల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై పోరాటం చేయాలని రాహుల్‌ సూచించినట్టు సంపత్‌ కుమార్‌ తెలిపారు. అంతకుముందు కాంగ్రెస్‌ నేతలు మల్లు రవి, కటకం మృత్యుంజయం, తదితరులు రాహుల్‌తో విడివిడిగా భేటీ అయ్యారు.


హైకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటామని ఈసీ హామీ..
కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తూ ఉప ఎన్నికల కోసం తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌పై తదుపరి చర్యలు తీసుకోబోమని కేంద్ర ఎన్నికల సంఘం హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్‌ నేతలు తెలిపారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్, మర్రి శశిధర్‌రెడ్డి, న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌లు శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్‌ ఓపీ రావత్‌ను కలిశారు.

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేస్తూ తెలంగాణ అసెంబ్లీ ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను హైకోర్టు కోట్టేసిందని, అందువల్ల రద్దు చేసిన అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలకు ప్రభుత్వం పంపిన నోటిఫికేషన్‌పై తదుపరి చర్యలు తీసుకోరాదని కోరారు. ఈ వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలకు కట్టుబడి ఉన్నామని, ఉప ఎన్నికల కోసం అందిన నోటిఫికేషన్‌పై తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోబోమని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి హామీ ఇచ్చినట్టు నేతలు మీడియాకు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయకుండా చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరామన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న 15 లక్షల ఓటర్లను తొలగించేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని, దీనిపైనా రావత్‌కు వివరించామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement