అమేథీలో రాహుల్‌కు ఎదురుగాలి!

Rahul Gandhi facing tough challenge in Amethi - Sakshi

కాంగ్రెస్‌ చీఫ్‌కు గట్టిపోటీ ఇవ్వనున్న స్మృతీ

వయనాడ్‌లో మాత్రం భారీ మెజారిటీ

పలువురు ప్రముఖులకు ఓటమి సంకేతాలు

ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌పోల్‌

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఈసారి ఎదురుగాలి వీయనుందని ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌పోల్‌ తెలిపింది. కాంగ్రెస్‌ కంచుకోటగా పేరుగాంచిన అమేథీలో రాహుల్‌కు బీజేపీ నేత, కేంద్ర మంత్రి స్మృతీఇరానీ నుంచి గట్టి పోటీ ఎదురుకానుందని వెల్లడించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌కు 4,08,651 ఓట్లు రాగా, ఆయనపై పోటీచేసిన స్మృతి ఏకంగా 3,00,748 ఓట్లను దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌–బీజేపీల మధ్య హోరాహోరీ పోరు తప్పకపోవచ్చని సర్వే తేల్చింది.

కాగా, రాహుల్‌ పోటీచేస్తున్న మరో నియోజకవర్గం వయనాడ్‌(కేరళ)లో ఆయన విజయం నల్లేరుపై నడకేనని సర్వే స్పష్టం చేసింది. వయనాడ్‌లో యూడీఎఫ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాహుల్‌ 7.30 లక్షల ఓట్ల మెజారిటీ(70 శాతం ఓట్ల)తో విజయం సాధించబోతున్నారని తెలిపింది. ఎల్డీఎఫ్‌ అభ్యర్థి, సీపీఐ నేత పి.పి.సునీర్‌ 23 శాతం ఓట్లతో 2.50 లక్షల ఓట్లను దక్కించుకుంటారని వెల్లడించింది. బీజేపీ–భారత్‌ ధర్మజనసేన(బీడీజేఎస్‌) అభ్యర్థి తుషార్‌ వెల్లప్పల్లె 7 శాతం ఓట్లను దక్కించుకుంటారని పేర్కొంది.

రాయ్‌బరేలీ సోనియాదే: యూపీలోని కాంగ్రెస్‌ కంచుకోట రాయ్‌బరేలీలో సోనియాగాంధీ ఘనవిజయం సాధిస్తారని తెలిపింది. 1999 నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న సోనియా మరోసారి ఈ స్థానాన్ని నిలుపుకుంటారని చెప్పింది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకొచ్చిన దినేశ్‌ ప్రతాప్‌సింగ్‌ను బీజేపీ సోనియాపై పోటీకి నిలిపింది. కాగా, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన్‌ సమాజ్‌ పార్టీ(బీఎస్పీ)లు ఇక్కడ తమ అభ్యర్థులను నిలబెట్టలేదు.

జయప్రదకు షాక్‌..
ఎస్పీ నేత ఆజంఖాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలతోనే ఈ నియోజకవర్గం ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నేత, నటి జయప్రదకు రాంపూర్‌లో ఓటమి తప్పకపోవచ్చని సర్వేలో తేలింది. రాంపూర్‌ ప్రజలు ఆజంఖాన్‌కు పట్టం కట్టబోతున్నారని వెల్లడించింది. జయప్రదతో పోల్చుకుంటే ఆజంఖాన్‌ రాంపూర్‌లో అందరికీ తెలిసిన వ్యక్తికావడం ఆయనకు లాభించిందని అభిప్రాయపడింది.
భోపాల్‌ ప్రజ్ఞా సింగ్‌దే: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌కు షాక్‌ తగలనుందని సర్వే తెలిపింది. భోపాల్‌లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ దిగ్విజయ్‌ సింగ్‌ను ఓడించబోతున్నారని ఎగ్జిట్‌పోల్‌ పేర్కొంది.

మాండ్యలో సుమలత జయభేరి..
కర్ణాటకలోని మాండ్యలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన నటి సుమలత విజయదుందుభి మోగించబోతున్నారని సర్వే తెలిపింది. సీఎం కుమారస్వామి కొడుకు జేడీఎస్‌–కాంగ్రెస్‌ అభ్యర్థి నిఖిల్‌ గౌడకు పరాజయం తప్పదని స్పష్టం చేసింది. మాండ్యలో బీజేపీ సుమలతకు మద్దతు పలికింది.

బెగుసరాయ్‌లో కన్హయ్య ఓటమి..
బిహార్‌లోని బెగుసరాయ్‌ లోక్‌సభ స్థానంలో కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌ ఘనవిజయం సాధిస్తారని తేలింది. ఈ ఎన్నికల్లో ఆర్జేడీ నేత తన్వీర్‌ హసన్‌ రెండో స్థానంలో, జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేత, సీపీఐ అభ్యర్థి కన్హయ్యకుమార్‌ మూడో స్థానంలో నిలుస్తారని పేర్కొంది

తిరుగులేని ‘షా’
గాంధీనగర్‌లో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా ఎగ్జిట్‌పోల్‌ తెలిపింది. ఈ ఎన్నికల్లో షా 8,92,775 ఓట్లు(67 శాతం) దక్కించుకోనుండగా, కాంగ్రెస్‌ అభ్యర్థి సీహెచ్‌ ఛవ్‌దా 3,31,602 ఓట్లు(26 శాతం), ఇతరులు నాలుగు శాతం ఓట్లను దక్కించుకుంటారని అంచనా వేసింది.

సర్వే ప్రకారం..
► యూపీలోని మైన్‌పురిలో ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం, బీజేపీ అభ్యర్థి ప్రేమ్‌ సింగ్‌  మధ్య హోరాహోరీ పోరు.
► కేరళలోని తిరువనంతపురంలో కాంగ్రెస్‌ అభ్యర్థి శశిథరూర్‌ ఎల్డీఎఫ్‌ అభ్యర్థి దివాకరణ్‌పై ఘనవిజయం సాధిస్తారు.
► బిహార్‌లోని పట్నాసాహిబ్‌లో బీజేపీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్, కాంగ్రెస్‌ అభ్యర్థి శత్రుఘ్నసిన్హాపై గెలుస్తారు.
► ఈశాన్యఢిల్లీలో కాంగ్రెస్‌ నేత షీలాదీక్షిత్‌పై బీజేపీ అభ్యర్థి మనోజ్‌ తివారీ స్వల్ప మెజారిటీతో విజయం సాధిస్తారు.
► తూర్పుఢిల్లీలో బీజేపీ అభ్యర్థి గౌతమ్‌ గంభీర్‌ కాంగ్రెస్‌ నేత అర్విందర్‌ లవ్లీపై గెలుస్తారు.
► తమిళనాడులోని శివగంగ నుంచి కాంగ్రెస్‌ నేత పి.కార్తి చిదంబరం, బీజేపీ నేత హెచ్‌.రాజాపై విజయం సాధిస్తారు.
► యూపీలోని సుల్తాన్‌పూర్‌లో కేంద్ర మంత్రి మేనకాగాంధీ, బీఎస్పీ అభ్యర్థి చంద్రభద్ర సింగ్‌ మధ్య హోరాహోరీ పోరు. స్వల్ప మెజారిటీతో మేనక గట్టెక్కే అవకాశం.
► తమిళనాడులోని తూత్తికుడిలో బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్‌పై డీఎంకే నేత కనిమొళి విజయం.
► పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో బీజేపీ నేత సన్నీడియోల్‌ చేతిలో కాంగ్రెస్‌ నేత సునీల్‌ కుమార్‌ జాఖర్‌ ఓటమి.
► పిలిభిత్‌లో ఎస్పీ అభ్యర్థి హేమరాజ్‌ వర్మపై బీజేపీ నేత వరుణ్‌గాంధీ విజయం.
► ఛింద్వారాలో మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ కుమారుడు, కాంగ్రెస్‌ అభ్యర్థి నకుల్‌నాథ్, ఆనంద్‌పూర్‌ సాహిబ్‌లో కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ ఘనవిజయం.
► న్యూఢిల్లీలో బీజేపీ అధికార ప్రతినిధి మీనాక్షి లేఖి, ఢిల్లీ కాంగ్రెస్‌ చీఫ్‌ అజయ్‌ మాకెన్‌ను మట్టికరిపిస్తారు.
► కేంద్రమంత్రి రామ్‌కృపాల్‌ యాదవ్‌ పాటలీపుత్ర నుంచి మరోసారి మిసాభారతి(ఆర్జేడీ)ని ఓడిస్తారు.
► ఉత్తర ముంబై కాంగ్రెస్‌ అభ్యర్థి ఊర్మిళ మతోండ్కర్, దక్షిణ ముంబై కాంగ్రెస్‌ అభ్యర్థి మిలింద్‌ దేవ్‌రాకు ఓటమి తప్పదు.
► పూరీ నుంచి బీజేపీ అభ్యర్థి సంబిత్‌ పాత్ర, నాగ్‌పూర్‌ నుంచి కేంద్రమంత్రి గడ్కారీ, బారామతి నుంచి ఎన్సీపీ నేత సుప్రియా సూలే విజయం సాధిస్తారు.
► మధ్యప్రదేశ్‌లోని గుణాలో జ్యోతిరాదిత్య సింధియా (కాంగ్రెస్‌), కేపీ యాదవ్‌  (బీజేపీ)మధ్య హోరాహోరీ పోరు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top