పార్లమెంటుకు అబద్ధం చెప్పారు

Rahul Gandhi challenges Nirmala Sitharaman to prove orders given to HAL or resign - Sakshi

హెచ్‌ఏఎల్‌కు లక్ష కోట్ల ప్రాజెక్టులకు నిర్మల ఆధారాలు చూపాలి

లేదంటే రక్షణ మంత్రి పదవికి ఆమె రాజీనామా చేయాలి

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ డిమాండ్‌

రాహుల్‌ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తుండటం సిగ్గుచేటు: నిర్మల

న్యూఢిల్లీ: హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)కు నిధుల కొరత ఏర్పడిందన్న అంశం అధికార, ప్రతిపక్షాల మధ్య మరో మాటల యుద్ధానికి దారితీసింది. హెచ్‌ఏఎల్‌కు రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇచ్చామని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటుకు అబద్ధం చెప్పారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. ఈ ప్రాజెక్టులకు సాక్ష్యాలు చూపలేకపోతే ఆమె మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు రాహుల్‌ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలనీ, హెచ్‌ఏఎల్, ప్రభుత్వం మధ్య రూ. లక్ష కోట్ల విలువైన ఒప్పందాలు జరిగినట్లుగా తానెప్పుడూ చెప్పలేదని నిర్మల స్పష్టం చేశారు.

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తూ యద్ధ విమానాలు, హెలికాప్టర్లు, జెట్‌ ఇంజిన్లు తదితరాలను తయారు చేసే ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్‌ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉందంటూ శనివారం ఓ వార్తా కథనం రావడం తెలిసిందే. సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలో రూ. వెయ్యి కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందనీ, ప్రభుత్వం నుంచి తమకు ఒక్క ప్రాజెక్టు కూడా రాలేదని హెచ్‌ఏఎల్‌ ఉన్నతాధికారులు చెప్పినట్లుగా ఈ కథనం వెల్లడించింది. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ప్రాజెక్టులో భారత్‌లో ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా ప్రభుత్వరంగ, అనుభవం ఉన్న హెచ్‌ఏఎల్‌ను కాదనీ, కొత్తదైన ప్రైవేటు సంస్థ రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంపిక చేయడంపై ఇప్పటికే కేంద్రంపై కాంగ్రెస్‌ తీవ్రంగా విమర్శలు చేస్తుండటం తెలిసిందే. అంబానీకి ప్రయోజ నం చేకూర్చేందుకే ప్రధాని మోదీ రిలయన్స్‌ను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేసి, ప్రభుత్వ సంస్థల ఉసురు తీస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

పార్లమెంటు ముందు దస్త్రాలు ఉంచండి
హెచ్‌ఏఎల్‌కు రూ. లక్ష కోట్ల విలువైన ప్రాజెక్టులు ఇచ్చిన దానికి సంబంధించిన దస్త్రాలను సోమవారం నిర్మల పార్లమెంటుకు సమర్పించాలనీ, లేని పక్షంలో ఆమె రాజీనామా చేయాలని రాహుల్‌ ఆదివారం డిమాండ్‌ చేశారు. ‘ఒక్క అబద్ధం చెబితే దాన్ని కప్పిపుచ్చడానికి మరెన్నో అబద్ధాలు చెబుతూ ఉండాలి. మోదీ రఫేల్‌ ‘అబద్ధం’ను కప్పిపుచ్చేందుకు ఇప్పుడు రక్షణ మంత్రి పార్లమెంటుకే అబద్ధం చెప్పారు’ అని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. హెచ్‌ఏఎల్‌ను కాదని రిలయన్స్‌కు రఫేల్‌ ప్రాజెక్టు ఇచ్చినందుకు కాంగ్రెస్‌ మొదటి నుంచి కేంద్రంపై విమర్శలు చేస్తోంది. శనివారం కూడా మోదీ తన సూటు–బూటు స్నేహితుడి (అనిల్‌ అంబానీ)కి సాయం చేసేందుకు హెచ్‌ఏఎల్‌ను బలహీనపరుస్తున్నారని  ఆరోపించారు.  

హెచ్‌ఏఎల్‌ ఏమంటోంది..
హెచ్‌ఏఎల్‌ ఈ అంశంపై స్పందిస్తూ.. 83 తేలికపాటి యుద్ధవిమానాలు, 15 తేలికపాటి యుద్ధ హెలికాప్టర్ల ప్రాజెక్టులపై కీలక దశల్లో ఉన్నాయనీ, త్వరలో తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉందని తెలిపింది. మార్చి వరకు ఖర్చుల కోసం రూ. 962 కోట్లను ప్రస్తుతం అప్పుగా తీసుకున్నామంది.

పూర్తిగా చదివి మాట్లాడాలి: నిర్మల
వార్తా కథనాన్ని పూర్తిగా చదివిన తర్వాత రాహుల్‌ గాంధీ మాట్లాడాలని నిర్మల హితవు చెప్పారు. ఆ కథనంలోనే ఉన్న వివరాలను ఆమె ఉటంకిస్తూ ‘ఈ ఒప్పందాలు పూర్తయినట్లుగా నిర్మల పార్లమెంటుకు చెప్పలేదు. ఆ దిశగా పనులు జరుగుతున్నాయని మాత్రమే ఆమె వెల్లడించినట్లు లోక్‌సభ రికార్డులు చెబుతున్నాయి’ అని పేర్కొన్నారు. రాహుల్‌ దేశాన్ని తప్పుదారి పట్టిస్తుండటం సిగ్గుచేటని ఆమె అన్నారు. ఆ తర్వాత నిర్మల కార్యాలయం ఓ ట్వీట్‌ చేస్తూ ‘రాహుల్‌ గాంధీ, మీరు ఏబీసీల నుంచి అన్నీ నేర్చుకోవాలి.

ప్రజలను తప్పుదారి పట్టిం చేందుకు ఉత్సాహం చూపుతున్న మీలాంటి వారే పూర్తిగా కథనాన్ని చదవకుండానే, అదే కథనం ఆధారంగా ఆరోపణలు చేస్తారు. అబద్ధం చెబుతున్నది మీరే రాహుల్‌. 2014–18 మధ్య హెచ్‌ఏఎల్, ప్రభుత్వం మధ్య రూ. 26,570.8 కోట్ల ఒప్పందాలు జరిగాయి. మరో రూ. 73 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కూడా ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు మీరు దేశ ప్రజలకు పార్లమెంటులో క్షమాపణ చెప్పి మీ పదవికి రాజీనామా చేస్తారా?’ అంటూ ఘాటుగా స్పందించింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top