రిలయన్స్‌ జేబులో రూ.30 వేల కోట్లు: రాహుల్‌

Rahul Gandhi Accuses Modi Of Corruption In Rafale Deal - Sakshi

ఢిల్లీ: ఇంత అత్యవసరంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫ్రాన్స్‌ దేశానికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని, అందులోనూ దసాల్ట్‌ ఏవియేషన్‌ ఫ్యాక్టరీకే ఎందుకు వెళ్తున్నారని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ఢిల్లీలో రాహుల్‌ విలేకరులతో మాట్లాడుతూ.. రాఫెల్‌ కాంట్రాక్ట్‌, దసాల్ట్‌కి ఇవ్వడానికి రిలయన్స్‌ డిఫెన్స్‌ సంస్థను భాగస్వామిగా తప్పనిసరిగా చేర్చుకోవాల్సి వచ్చిందని ఆ కంపెనీ డిప్యూటీ సీఈఓ చెప్పారని ఫ్రెంచ్‌ మీడియాలో వచ్చిన కథనాలను ఉదహరించారు. కేవలం ఈ కాంట్రాక్టుకు 10 రోజుల ముందే అనిల్‌ అంబానీ, రియలన్స్‌ డిఫెన్స్‌ సంస్థను ఏర్పాటు చేశారని వెల్లడించారు. కాంట్రాక్ట్‌ వారికే అప్పగించడం ద్వారా ప్రధాని మోదీ రిలయన్స్‌ జేబులో రూ.30 వేల కోట్లు వేశారని ఆరోపించారు.

నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని కాదని, అంబానీలకే ప్రధాని అని ఎద్దేవా చేశారు. భారత ప్రభుత్వం ఏం చెప్పమంటే అదే చెప్పేలా దసాల్ట్‌ కంపెనీపై తీవ్రమైన ఒత్తిడి ఉందని ఆరోపించారు(ఈ వ్యాఖ్యలను దసాల్ట్‌ కంపెనీ కొట్టిపడేసింది).  మీడియాపైన కూడా ఇదే రకమైన ఒత్తిడి తీసుకొస్తున్నారని విమర్శించారు. గతంలో ఫ్రెంచ్‌ పోర్టల్‌ మీడియా పార్ట్‌లో వచ్చిన కథనాల ప్రకారం దసాల్ట్‌ కంపెనీ తప్పనిసరిగా రిలయన్స్‌తో జోడీ కట్టాల్సి వచ్చిందని రాసిందని పేర్కొన్నారు. ప్రతిపక్షం డిమాండ్‌ చేస్తున్నట్లు ఈ వ్యవహారంపై మోదీ ప్రభుత్వం ఎందుకు దర్యాప్తు చేయించటం లేదని ప్రశ్నించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top