కాంగ్రెస్‌ బస్సు యాత్రకు రాహుల్‌!

Rahul To Attend Bus Yatra in Telangana - Sakshi

 అసెంబ్లీ సమావేశాలకు ముందా.. తర్వాతా?

 త్వరలోనే స్పష్టత.. సభకు మాత్రం తప్పుకుండా హాజరు

 పాదయాత్ర చేస్తానంటున్న డీకే అరుణ

 ఇప్పటికే కుంతియాకు సమాచారం.. ఏఐసీసీకి కూడా లేఖ!

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన బస్సు యాత్రకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కూడా హాజరవుతారని తెలుస్తోంది. టీపీసీసీ ఆహ్వానం మేరకు బస్సు యాత్రలో పాల్గొనేందుకు రాహుల్‌ అంగీకరించారని గాంధీభవన్‌ వర్గాలంటున్నాయి. జూన్‌ మొదటి వారంలో జరిగే బహిరంగ సభకు రాహుల్‌ను ఆహ్వానించాలని తొలుత భావించారు. అయితే బస్సు యాత్రకు కూడా వచ్చిపోతే మరింత ప్రభావం ఉంటుందనే ఆలోచనతో రాహుల్‌ను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంప్రదించారని, రాహుల్‌ సానుకూలంగా స్పందించారని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు.

అయితే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభానికి ముందే ఆయన వస్తారా.. లేక ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే తుది విడత బస్సు యాత్రకు హాజరవుతారా అనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదని సమాచారం. బస్సు యాత్రకు రాహుల్‌ ఎప్పుడు వచ్చినా.. ఒకవేళ రాకున్నా.. జూన్‌ మొదటి వారంలో హైదరాబాద్‌ లేదా వరంగల్‌లో నిర్వహించే బహిరంగ సభకు మాత్రం రానున్నారు.

నేనూ పాదయాత్ర చేస్తా! : డీకే అరుణ
పాదయాత్ర చేసే వారి జాబితాలోకి మాజీ మంత్రి డీకే అరుణ కూడా చేరారు. ఇప్పటికే మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, రేవంత్‌రెడ్డిల పాదయాత్రలకు ఏఐసీసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వగా, ఇప్పుడు అరుణ కూడా పాదయాత్రకు సై అంటున్నారు. ఆలంపూర్‌ నుంచి ఆదిలాబాద్‌ వరకు తాను పాదయాత్ర చేస్తానని.. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియాకు ఆమె సమాచారం ఇచ్చారు.

ఇటీవల కుంతియా హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఫోన్‌లో మాట్లాడి తన ప్రతిపాదనను చెప్పారని అరుణ సన్నిహితులు చెబుతున్నారు. ఏఐసీసీకి లేఖ రాయాలంటూ కుంతియా సూచించినట్లు సమాచారం. దీంతో తన పాదయాత్ర ప్రతిపాదనతో కూడిన లేఖను ఆమె త్వరలోనే ఏఐసీసీకి పంపనున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్‌ పాదయాత్ర, పార్టీలోకి నాగం జనార్దనరెడ్డి చేరిక, ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి తదితరుల వ్యతిరేకత, చిన్నారెడ్డి వంటి నేతల సానుకూలతలతో హాట్‌హాట్‌గా ఉన్న పాలమూరు రాజకీయం.. ఇప్పుడు డీకే అరుణ పాదయాత్ర ప్రతిపాదనతో మరింత వేడెక్కనుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top