వేగంగా ‘పంచాయతీ’ రిజర్వేషన్ల కసరత్తు

Panchayat Election in three phases - Sakshi

రెండ్రోజుల్లో రాష్ట్ర స్థాయిలో కోటా

వీటి ఆధారంగా జిల్లాల వారీగా లెక్కలు

తర్వాత ఈసీకి రిజర్వేషన్ల జాబితా

వెంటనే ఎన్నికల నోటిఫికేషన్‌ ప్రకటన

మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ!  

సాక్షి, హైదరాబాద్‌: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారు కసరత్తు ఊపందుకుంది. ఈ నెల 27లోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి రిజర్వేషన్ల జాబితా అందించాల్సి ఉండటంతో ఈ ప్రక్రియలో అధికార యంత్రాంగం పూర్తిగా నిమగ్నమైంది. రెండు మూడ్రోజుల్లోపే ఈ రిజర్వేషన్లకు తుదిరూపు ఇవ్వవచ్చునని తెలుస్తోంది. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి లోబడి ఉండాలన్న కోర్టు నిబంధనల ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల కేటాయింపునకు చర్యలు ముమ్మరం చేశారు. 50 శాతం రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నట్టు ప్రభుత్వం రిజర్వేషన్ల ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీంతో ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల ఖరారు అధికారులకు కత్తి మీద సాముగా మారింది. 2013లో ఉమ్మడి ఏపీలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లు 60.55% (బీసీలకు 34%) అమలయ్యాయి. ఇప్పు డు 50 శాతానికి ఈ రిజర్వేషన్లను పరిమితం చే యాల్సి ఉండటంతో ప్రస్తుతం సవరణలు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు తేల్చాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో బీసీలకు 24% మించకుండా రిజర్వేషన్లు ఉండొచ్చునని అంచనా వేస్తున్నారు. అప్పుడు మిగతా 26 శాతాన్ని ఎస్సీ, ఎస్టీ లకు పంచాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాష్ట్రంæ ఏర్పడ్డాక తొలిసారిగా రిజర్వేషన్లకు సంబంధించి ఈ పంచాయతీ ఎన్నికల్లో కొత్త రొటేషన్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. 

జనాభా మేరకు రిజర్వేషన్లు.. 
రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. వాటిలో 17 పంచాయతీల కాలపరిమితి మరో ఏడాది పాటు ఉండటంతో ప్రస్తుతం 12,734 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే మొత్తం 12,751 పంచాయతీలకు కోటా నిర్ణయించి తదనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించే సర్పంచ్‌ పదవుల శాతాన్ని తేల్చనున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణ పరిధిలోని ఎస్సీ, ఎస్టీ ల జనాభాను లెక్కించాల్సి ఉంటుంది. ముఖ్యం గా గ్రామీణ ప్రాంతా ల్లో నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీలు ఎంత మంది ఉన్నారనే లెక్కలు తీశాకే రాష్ట్ర స్థాయి జనాభా కోటాకు అనుగుణంగా నిర్ణయిస్తారు. ఆ తర్వాత ఏ జిల్లాలో ఎవరెవరు ఎంత మంది ఉన్నారనే లెక్కల ప్రకారం జిల్లాల్లో రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. బీసీ వర్గాల రిజర్వేషన్లను మాత్రం ఓటర్ల జాబితాలో మండలం, గ్రామం వారీగా ఎంత మంది బీసీ ఓటర్లు, వారి ఓట్ల శాతాన్ని బట్టి రిజర్వేషన్లు నిర్ణయిస్తారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని 1,308 గ్రామ పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు చేయడం తప్పనిసరి. అలాగే వంద శాతం ఎస్టీ వర్గం వారున్న 1,326 గ్రామ పంచాయతీలను ఈ వర్గం వారికే కేటాయిస్తారు. ఇవికాకుండా మైదాన ప్రాంతం గ్రామ పంచాయతీల్లోని మొత్తం జనాభా ఆధారంగా ఆ కేటగిరీకి రిజర్వేషన్‌ ఉంటుంది. అయితే రిజర్వేషన్ల జాబితా అందగానే ఈసీ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది.

మూడు విడతల్లో ఎన్నికలు! 
మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఒక్కో విడతకు మధ్యలో రెండు మూడ్రోజుల విరామం ఇచ్చి విడివిడిగా నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశాలున్నట్టు సమాచారం. జిల్లాల్లో స్థానికంగానే ఈ ఎన్నికల నోటిఫికేషన్లను జారీ చేస్తారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 10 లోపు గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top