
సాక్షి, బెంగళూరు: మరో 15 రోజుల తర్వాత తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యురప్ప ధీమా వ్యక్తం చేశారు. నెలమంగలలో జరిగిన బీజేపీ పార్టీ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి యడ్యురప్ప మాట్లాడారు.
15 రోజుల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో లక్షల మంది ప్రజల మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని యడ్యురప్ప చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చరమగీతం పాడాలని, కాంగ్రెస్ లేని కర్ణాటకగా రాష్ట్రాన్ని మారుద్దామని సూచించారు. 150 స్థానాల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తామని చెప్పారు. మరో 12 రోజుల్లో ఈ అవినీతి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాలన నుంచి విముక్తి లభిస్తుందని జోస్యం చెప్పారు.
అవినీతికి అంకితమైన సీఎం
సాక్షి,బెంగళూరు: ‘సీఎం సిద్దరామయ్య ఓ మూర్ఖుడు, ఆయన అంతటి అవినీతి పరుడిని నేనింత వరకు చూడనేలేదు, అవినీతికి అంకితమైన సీఎం సిద్దరామయ్యకు నా గురించి మాట్లాడే నైతిక హక్కులేదు, నా గురించి మాట్లాడానికి సీఎం సిద్దరామయ్య సిగ్గుండాలి’ అంటూ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప తీవ్ర పదజాలంతో సీఎం సిద్దరామయ్యపై ధ్వజమెత్తారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన యడ్యూరప్ప ప్రసంగం ఆసాంతం ఇలానే కొనసాగింది. అవినీతి పరుడంటూ పదేపదే నాపై ఆరోపణలు చేస్తున్న సీఎం సిద్దరామయ్య ముందు తన చుట్టూ ఉన్న దోపిడీదారుల గురించి తెలుసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చేసిన అవినీతి పనులు లోకాయుక్త అడ్డు వస్తుందనే భయంతో లోకాయుక్తను నిర్వీర్యం చేసారంటూ సీఎం సిద్దరామయ్యపై విమర్శలు చేశారు. లోకాయుక్త సక్రమంగా ఉండిఉంటే మీతో పాటు మీచుట్టూ ఉన్న దోపిడీ మంత్రులంతా సంవత్సరాల తరబడి జైలులో గడపాల్సి వచ్చేదన్నారు.
చాముండేశ్వరితో పాటు బాదామిలో కూడా ఓటమికి సిద్ధంగా ఉండాలని రెండు నియోజకవర్గ ప్రజలను మిమ్మల్ని ఘోరంగా ఓడించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నారు. బీజేపీలో యడ్యూరప్ప డమ్మి అంటూ వ్యాఖ్యలు చేసే అధికారం మీకు ఎవరిచ్చారంటూ ప్రశ్నించడంతో పాటు కాంగ్రెస్ పార్టీలో నయాపైసా కూడా ఉపయోగం లేని నేతల జాబితాలో మొదటిస్థానంలో మీరు ఉంటారని మీ పార్టీలోనే మీకు గౌరవం లేదని అటువంటి నీకు నాపై వాఖ్యలు చేసే నైతిక హక్కు ఉందా అంటూ ప్రశ్నించారు. రాహుల్‌గాంధీని మీ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నకున్నపుడే మీ పార్టీ స్థాయి ఏంటో ప్రజలందరికీ తెలిసిపోయిందని, రాహుల్‌గాంధీ చెబుతున్నదేమిటో ప్రజలెవరికీ అర్థం కావడం లేదని అందుకు రాహుల్‌గాంధీ ప్రచారం చేసిన ప్రతీ రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఓటమి ఎదురవుతోందన్నారు. కర్ణాటకలో కూడా కాంగ్రెస్ పార్టీకి అదేగతి పట్టనుందని మీతో పాటు మీ మంత్రులంతా ఇళ్లకే పరిమితం కానున్నారని యడ్యూరప్ప మండిపడ్డారు.