
సాక్షి, ముంబై: త్వరలో జరుగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీలోని మొత్తం 288 స్థానాలకు మరో మూడు నెలల్లో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో పొత్తులపై పార్టీలు వేగం పెంచాయి. ఎమ్‌ఎన్‌ఎస్పీ చీఫ్ రాజ్ ఠాక్రే ఇటీవల యూపీయే చైర్‌పర్సన్ సోనియా గాంధీతో ఢిల్లీలో భేటీ అయిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల్లో కూటమిగా పోటీ చేద్దామని ఠాక్రే ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. తాజాగా శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు ముంబైలు సమావేశమయ్యారు.
అయితే సీట్ల పంపకాలపై భేటీ అయిన ఎన్సీపీ నేతలు కాంగ్రెస్ వద్ద ఊహించిన ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు కలవాలంటే.. తమకు 50శాతం స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ 21 స్థానాల్లో పోటీ చేయగా.. కాంగ్రెస్ 26 సీట్లల్లో బరిలో నిలిచింది. అయితే అనూహ్యంగా ఎన్సీపీ నాలుగు, కాంగ్రెస్ కేవలం ఒక్క స్థానంలోనే గెలుపొందాయి. దీంతో కాంగ్రెస్‌తో పొల్చుకుంటే తామే బలంగా ఉన్నామని భావిస్తోన్న ఎన్సీపీ నేతలు సగం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై వారిద్దరి మధ్య చర్చలు ఇంకా సాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇరు పార్టీలు 1999 నుంచి కలిసి పోటీ చేస్తున్నట్లు విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో రెండు పార్టీలు చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఎన్సీపీ నూతన అధ్యక్షుడిని నియమంచింది. ఆ పార్టీ సీనియర్ నేత బాలాసాహేబ్ తోరట్‌ను మహారాష్ట్ర నూతన సారథిగా నియమిస్తున్నట్లు.. శరద్ పవార్ మంగళవారం ప్రకటించారు. మరోవైపు శివసేన-బీజేపీ మరోసారి విజయం ధీమా ఉన్నాయి. అత్యధిక స్థానాలను గెలిచేందుకు ఎవరికి వారే వ్యూహాలు రచిస్తున్నారు.