టీఆర్‌ఎస్‌లోకి మోత్కుపల్లి..?

Motkupalli Narasimhulu Trying To Join In TRS Party Nalgonda - Sakshi

చంద్రబాబు తీరుపై అలిగిన సీనియర్‌ నేత మినీ మహానాడుకు గైర్హాజరు

పక్కన పెట్టారనే భావనతోనే దూరంగా ఉంటున్న నర్సింహులు

త్వరలో సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకోనున్నారంటున్న అనుచరవర్గం

సాక్షి,యాదాద్రి : సీనియర్‌ టీడీపీ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌లో చేరికకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. వచ్చే నెల రెండోవారంలో ఆయన టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీరుతో మనస్తాపం చెందిన మోత్కుపల్లి ఇక ఆ పార్టీని వీడే యోచనలో ఉన్నారు. తెలంగాణలో టీడీపీని బతికించుకోవడానికి టీఆర్‌ఎస్‌లో విలీనం చేయాలని  గత మార్చి 18న మోత్కుపల్లి వ్యాఖ్యలతో చంద్రబాబు ఆయనను దూరంగా పెట్టారు. పార్టీలో సీనియర్‌ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడైన మోత్కుపల్లి లేకుండానే హైదరాబాద్‌లో చంద్రబాబు పొలిట్‌బ్యూరో సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. టీడీపీని తెలంగాణలో బతికించుకోవడానికి తాను అలా వ్యాఖ్యానించానే తప్ప వేరే ఉద్దేశం లేదని ఆ తర్వాత మోత్కుపల్లి మీడియాకు వివరించారు. అయినా చంద్రబాబు వైఖరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మోత్కుపల్లి ఇక పార్టీ మారడంపై సీరియస్‌గా దృష్టిసారించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తిరగలేని రోజుల్లో మోత్కుపల్లి ముందుండి టీఆర్‌ఎస్‌ను దీటుగా ఎదుర్కొన్నారు. 

అలాగే సీనియర్‌ నేత అయిన మోత్కుపల్లికి గవర్నర్‌ పదవీ వస్తుందంటూ గడిచిన మూడేళ్లుగా చెబుతూ వచ్చారు. పదవీ రాకపోవడంతోపాటు పార్టీలో తనకు సరైన గుర్తింపు లభించడం లేదన్న అభిప్రాయం మోత్కుపల్లిలో ఉంది.  కొన్ని నెలలుగా పార్టీ కార్యక్రమాలకు మోత్కుపల్లి దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ చంద్రబాబు వైపు నుంచి ఎలాంటి సానుకూలత వ్యక్తం కాలేదు. భువనగిరిలో జరిగిన మినీమహానాడులో మోత్కుపల్లి పాల్గొనలేదు. ఆయన అనుచరులు మోత్కుపల్లి లేకుండా జిల్లాలో మినీ మహానాడు నిర్వహించడం ఏమిటని ప్రశ్నించారు. దీనికి స్పందించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, చంద్రబాబు దృష్టికి మోత్కుపల్లి విషయాన్ని తీసుకుపోతామని చెప్పారు. అయితే సీనియర్‌ నేత అయిన మోత్కుపల్లిని మినీ మహానాడుకు రావాలని, పార్టీ హైకమాండ్‌ నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతోనే  ఆయన దూరంగా ఉన్నారని సమాచారం.

ముహూర్తం వచ్చే నెలలోనే..?
కొంత కాలంగా మౌనంగా ఉంటున్న మోత్కుపల్లి వచ్చేనెలలో టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నారని చర్చ జరుగుతోంది. ఈనెలాఖరులోగా జిల్లా స్థాయిలో టీడీపీ కార్యకర్తలు, తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించి టీఆర్‌ఎస్‌లో చేరికకు ప్రణాళికలు తయారు చేస్తున్నారని తెలిసింది. పంచాయతీరాజ్, స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే ఆయన టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. చంద్రబాబు పిలుపు కోసం ఎదురుచూసిన మోత్కుపల్లి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ వైపు అడుగులు వేస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆయన సన్నిహితులతో చెబుతున్నారు. ఆలేరు అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తూ ఆయన టీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత తుంగతుర్తి అసెంబ్లీ, వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఏదో ఒక చోట నుంచి పోటీ చేయాలని టీఆర్‌ఎస్‌ కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలుమార్లు టీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు మోత్కుపల్లిని కలిసి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించినట్లు సమాచారం. ఈనేపథ్యంలో తెలుగుదేశంలో ఉండి అవమానం భరించే కంటే టీఆర్‌ఎస్‌లో చేరడమే మేలని అనుచరులు మోత్కుపల్లిని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో వచ్చే నెలలో మోత్కుపల్లి టీఆర్‌ఎస్‌లో చేరికకు సంకేతాలు కనిపిస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top