
సాక్షి, తిరుపతి: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేయనున్నవిషయం తెలిసిందే. నవంబర్ 6వ తేదిన ఇడుపులపాయ నుంచి పాదయాత్ర మొదలవుతుంది. అధినేత జగన్ తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని ఎమ్మెల్యే రోజా అప్పలయగుంట గుడిలో కొబ్బరి కాయలు కొట్టి పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు తన ఆస్తులను పెంచుకున్నారు.. కుమారుడికి మంత్రి పదవి, కోడలికి ఆస్తులు, భార్యకు హౌస్ కట్టించారని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ పాదయాత్ర అంటే బాబుకు భయం పట్టుకుందని ఎమ్మెల్యే రోజా అన్నారు. 3,000 కిలోమీటర్ల తన యాత్రలో దారి పొడవునా 45 లక్షల మందిని ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం ఉంటుందని వైఎస్ జగన్ చెప్పిన విషయం తెలిసిందే.