బీజేపీ స్వయంకృతం

Manmohan Singh hits out at Modi govt calls slowdown man made crisis - Sakshi

దేశ ఆర్థిక పరిస్థితిపై మన్మోహన్‌

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఆందోళనకరంగా ఉందని.. బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలు మాని... ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పడం బీజేపీ స్వయంకృతమని,  అన్ని అంశాల్లోనూ సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లనే వృద్ధిరేటు మందగమనంలో సాగుతోందని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పరిమితం కావడం.. ఆర్థిక మాంద్యం కొనసాగుతోందనేందుకు సూచన అని ఆయన చెప్పారు.

ఇంతకంటే ఎక్కువ వేగంగా వృద్ధి చెందే సామర్థ్యం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేకపోయిందని అన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే యువత, రైతులు, వ్యవసాయ కూలీలు, పారిశ్రామిక వేత్తలకు మరిన్ని కష్టాలు తప్పవని హెచ్చరించారు. తయారీ రంగం వృద్ధి 0.6 శాతం మాత్రమే ఉండటం మరింత ఆందోళన కలిగించే అంశమని వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమల్లో లోపాల ఫలితాల నుంచి దేశం బయటపడలేదు అనేందుకు తాజా పరిణామాలు నిదర్శనమని విమర్శించారు.

మోదీ హయాంలో దేశంలోని అన్ని రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని, వాటి స్వతంత్ర ప్రతిపత్తికి ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌బీఐ నుంచి అందిన రూ.1.76 లక్షల కోట్లతో ఏం చేయాలన్న విషయంపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నది నిజమైతే... ఆర్‌బీఐకు పరీక్షేనని అన్నారు. పన్ను ఆదాయంలో భారీ కోత పడగా.. చిన్న, పెద్ద పారిశ్రామికవేత్తలందరూ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ అధికారుల వేధింపులకు గురవుతున్నారన్నారు.  ఒక్క ఆటోమొబైల్‌ రంగంలోనే 3.5 లక్షల ఉద్యోగాలు పోయాయని,  గిట్టుబాటు ధరల్లేక రైతుల ఆదాయాలు తగ్గిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top