భారత్‌ బంద్‌.. లెఫ్ట్‌ పార్టీలపై మమత ఫైర్‌

Mamata Banerjee Slams Left For Calling Bharat Bandh - Sakshi

కోల్‌కతా : వామపక్ష పార్టీలపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. లెఫ్ట్‌ పార్టీలు భారత్‌ బంద్‌కు పిలుపునివ్వడంపై విమర్శలు గుప్పించారు. చీప్‌ పబ్లిసిటీ కోసమే ఆ పార్టీలు బంద్‌కు పిలుపునిచ్చాయని ధ్వజమెత్తారు. బుధవారం మమత మాట్లాడుతూ.. బంద్‌కు పిలుపునిచ్చిన లెఫ్ట్‌ పార్టీలు బస్సులపై బాంబులు వేసి చీప్‌ పబ్లిసిటీ పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు పాల్పడటం కన్నా.. రాజకీయంగా సమాధి కావడం ఉత్తమమని అన్నారు. 

రాష్ట్రంలో రాజకీయ ఉనికి లేనివారు.. బెంగాల్‌ ఆర్థిక పరిస్థితిని దిగజార్చడానికి సమ్మెల పేరిట నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మమత మండిపడ్డారు. బెంగాల్‌లో ఎటువంటి సమ్మెలను అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీపీఎంకు ఎటువంటి భావజలం లేదన్న మమత.. రైల్వే ట్రాక్‌లపై బాంబులను విసరడం, ఉద్యమం పేరుతో ప్రయాణికులపై దాడికి పాల్పడటం గుండాగిరికి నిదర్శనమన్నారు. ఈ చర్యలను తను ఖండిస్తున్నట్టు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలకు, సీఏఏకు, ఎన్నార్సీకి వ్యతిరేకంగా జరుగుతుందని మమత గుర్తుచేశారు. అయితే బంద్‌ వెనక ఉన్న ఉద్దేశానికి తన మద్దతు ఉంటుందన్న ఆమె.. తమ పార్టీ గానీ, ప్రభుత్వం గానీ బంద్‌కు వ్యతిరేకమని స్పష్టం చేశారు.  దేశవ్యాప్తంగా సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో ఆ పార్టీలు ఎక్కడ కనిపించలేదన్నారు. కానీ ఇప్పుడు ఆ పేరుతో బంద్‌కు పిలుపునివ్వడం ఆశ్చర్యంగా ఉందని ఎద్దేవా చేశారు.

కాగా, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం తమ ఉద్యోగులు బుధవారం రోజున సాధారణ సెలువు పొందడంపై నిషేధం విధించింది. మరోవైపు దేశవ్యాప్తంగా భారత్‌ బంద్‌ కొనసాగుతోంది. బెంగాల్‌లో పలు చోట్ల కార్మిక సంఘాల నాయకులు రోడ్లపై, రైల్వే ట్రాక్‌ల బైఠాయించి నిరసన తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలపై ఇచ్చిన బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తెలిపింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top