‘నాలుగేళ్లలో 2.49 లక్షల కోట్ల రూపాయల అప్పు’

Left Parties Maha Garjana Song Released - Sakshi

సాక్షి, విజయవాడ: నాలుగేళ్లలో 2 లక్షల 49 వేల కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. సెప్టెంబర్‌ 15న విజయవాడలో  వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించనున్ననూతన ప్రత్యామ్నాయ మహా గర్జన సభకు సంబంధించిన ప్రచార గీతమాలికను సోమవారం ఆయన అవిష్కరించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి సీపీఎం జాతీయ కార్యవర్గసభ్యులు శ్రీనివాసరావు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ.. నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం సెప్టెంబర్‌ 15న ఛలో విజయవాడ కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ మహా గర్జనలో ప్రతిఒక్కరూ పాల్గొనాలని పిలపునిచ్చారు. ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం అనేక సదస్సులు నిర్వహించినట్టు పేర్కొన్నారు. రాయలసీమ వెనుకబాటుతనం, అక్కడి కరువు పరిస్థితులపై మంగళవారం వైఎస్సార్‌ జిల్లాలో సదస్సు నిర్వహించనున్నట్టు తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈ యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నారు. సీఎం చంద్రబాబు నాయుడువి కేవలం ప్రచార ఆర్భాటలు మాత్రమేనని.. వాటి ద్వారా ప్రజలకు ఒరిగేదేమీ ఉండదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజధానిని నిర్మించకుండా ముంబై వెళ్లి బాండ్లను విడుదల చేయడం ఎంతవరకు కరెక్ట్‌ అని ప్రశ్నించారు. రాజధానిలో సెంట్‌ భూమి కొనుక్కొని, ఇళ్లు కట్టుకునే పరిస్థితి లేదని వ్యాఖ్యనించారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అవినీతిమయంగా మారిందని మండిపడ్డారు. మార్చురీలో పోస్టుమార్టంకు కూడా డబ్బులు వసూలు చేసేంతలా అవినీతి పెరిగిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి విలయం తాండవం చేస్తుంటే.. చంద్రబాబు డ్యాష్‌ బోర్డులో అది కనబడకపోవడం సిగ్గుచేటన్నారు.

అది జ్ఞాన భేరి ఎలా అవుతుంది..
శ్రీనివాసరావు మాట్లాడుతూ.. చంద్రబాబు అధర్మ పాలన చేస్తూ ధర్మ పోరాటం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వేలాది ఎకరాల భూములు లాక్కొని ఒక్క పరిశ్రమైనా నిర్మించారా అంటూ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీపై చంద్రబాబు చేసేది నిజమైన పోరాటం కాదని అన్నారు. ప్రశ్నించే హక్కు లేకుండా విద్యార్థులను అరెస్ట్‌ చేస్తే అది జ్ఞాన భేరి ఎలా అవుతుందో సమాధానం చెప్పాలన్నారు. ముంబై వెళ్లి బాండ్ల లిస్టింగ్‌పైన చూపే శ్రద్ద నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం మీద పెట్టాలని సూచించారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top