చిచ్చుపెట్టిన కేబినెట్‌ కూర్పు

Left out of Karnataka cabinet expansion, prominent Congress MLAs - Sakshi

కర్ణాటకలో మారుతున్న రాజకీయం

రాహుల్‌ వద్ద అసంతృప్త ఎమ్మెల్యేల పంచాయితీ

శాఖల కేటాయింపుపై జేడీఎస్‌ మంత్రుల అసంతృప్తి

బెంగళూరు: కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణతో రేగిన అసంతృప్తి సెగలు మరింత పెరిగాయి. కేబినెట్‌లో చోటు దక్కని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తో సమావేశమై నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు శాఖల కేటాయింపుపై జేడీఎస్‌ మంత్రులు అసహనంతో ఉన్నారు. జేడీఎస్‌ మంత్రులు జీటీ దేవెగౌడకు ఉన్నత విద్య, సీఎస్‌ పుట్టరాజుకు చిన్న నీటి పారుదల శాఖల కేటాయింపు చర్చనీయాంశమైంది.

అసెంబ్లీ ఎన్నికల్లో చాముండేశ్వరి నుంచి మాజీ సీఎం సిద్దరామయ్యను జీటీ దేవెగౌడ ఓడించారు. పుట్టరాజు లోక్‌సభకు రాజీనామా చేసి మెల్కొటే అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు. వారిద్ద్దరు రవాణా వంటి కీలక శాఖను ఆశించారు. ఆ శాఖను తమకు కేటాయించకుడా.. జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ బంధువు డీసీ తమ్మన్నకు ఇవ్వడంపై ఆగ్రహంగా ఉన్నారు. తమ నేతలకు కీలక శాఖలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ.. ఆ ఇద్దరు మంత్రుల మద్దతుదారులు మైసూరు, మాండ్యల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.  

ప్రజాసేవకు ఏ శాఖ అయితే ఏంటి?: సీఎం   
జేడీఎస్‌ మంత్రుల అసమ్మతిపై సీఎం కుమారస్వామి మండిపడ్డారు. ప్రజలకు సేవ చేసేందుకు ఏ శాఖ అయితే ఏంటని ప్రశ్నించారు. 8వ తరగతి చదువుకున్న జీటీ దేవెగౌడకు ఉన్నత విద్య శాఖ కేటాయించడంపై స్పందిస్తూ.. నేనేం చదువుకున్నాను? ముఖ్యమంత్రిగా పనిచేయడం లేదా? అని ప్రశ్నించారు. కుమారస్వామి బీఎస్సీ డిగ్రీ చదివారు.  

ఢిల్లీలో కాంగ్రెస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలు  
ఎంబీ పాటిల్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ అసంతృప్త ఎమ్మెల్యేలు ఢిల్లీలో రాహుల్‌తో సమావేశమయ్యారు.  సమావేశం అనంతరం పాటిల్‌ మాట్లాడుతూ.. ‘రాహుల్‌తో నా అభిప్రాయాల్ని పంచుకున్నాను.   ప్రత్యేకంగా ఏమీ డిమాండ్‌ చేయలేదు. సమావేశ వివరాలపై మిగతా 15–20 మంది ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాం’ అని చెప్పారు. రాహుల్‌తో భేటీలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడు అహ్మద్‌ పటేల్, కేపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ దినేశ్‌ గుండూరావుతో పాటు కర్ణాటక మంత్రి కృష్ణ బైరే గౌడ పాల్గొన్నారు.

‘విభేదాల్ని పరిష్కరించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. అయితే ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి’ అని గౌడ చెప్పారు. సిద్దరామయ్య ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఎంబీ పాటిల్, దినేష్‌ గుండూరావు, ఆర్‌.రామలింగారెడ్డి, రోషన్‌బేగ్, హేచ్‌కే పాటిల్, శివశంకరప్ప, జర్కిహోళి వంటి వారికి కేబినెట్‌లో చోటు దక్కలేదు. వారంతా కుమారస్వామి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు.  

బీజేపీలో చేరేందుకు పలువురు సిద్ధం: యడ్యూరప్ప
కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన అనేక మంది అసంతృప్త ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని కర్ణాటక ప్రతిపక్ష నేత బీఎస్‌ యడ్యూరప్ప చెప్పారు. బెంగళూరులో పార్టీ నేతల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘జేడీఎస్, కాంగ్రెస్‌ల్లో అసంతృప్తిగా ఉన్నవారిని చేర్చుకోవడం మన బాధ్యత’ అని అన్నారు.   

అసమ్మతిని ఎదుర్కొనేందుకు కొత్త ఫార్ములా
పార్టీలో, ఎమ్మెల్యేల్లో పెరుగుతున్న అసమ్మతిని అధిగమించేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం కొత్త ఫార్ములాను తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మంత్రులుగా తీసుకున్న వారిని రెండేళ్ల పాటు కొనసాగించి ఆ తర్వాత కొత్త వారికి అవకాశం కల్పించడం అందులో ఒకటి. మంత్రుల పనితీరుపై ఆరునెలలకోసారి సమీక్ష నిర్వహించి సరిగా పనిచేయని వారికి ఉద్వాసన పలికి కొత్తవారికి చాన్స్‌ ఇవ్వడం. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వకపోవడం, ఆరు కేబినెట్‌ పోస్టుల్ని భర్తీ చేయకుండా అవసరమున్నప్పుడు విస్తరించడం వంటివి కూడా ఫార్ములాలో ఉన్నాయి.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top