ముస్లింలకు స్వేచ్ఛ భారత్‌లోనే..

Laxman Comments On CAA - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వక్రభాష్యం చెబుతూ అస్థిరత్వాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ మండిపడ్డారు. బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం బీజేపీ కార్యాలయంలో సీఏఏ అనుకూల సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనూ కొన్ని రాజకీయ పార్టీల నేతలు ముస్లింల పౌరసత్వం తొలగిస్తారని ముస్లింలలో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లో మైనారిటీలుగా దుర్భర జీవితం గడుపుతున్న వారికి పౌరసత్వం ఇచ్చేందుకు చర్యలు చేపడితే దానిని తప్పుగా అన్వయిస్తూ దేశంలోని ముస్లింలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు.

52 ముస్లిం దేశాల్లో లేని స్వేచ్ఛ.. భారత్‌లో ముస్లింలకు ఉందని పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌సీ అంశంపైనా కొందరు ముస్లింలను రెచ్చగొడుతున్నారని, దేశాన్ని అస్థిరపరిచేందుకు కొన్ని అదృశ్య శక్తులు ఢిల్లీలో అల్లర్లు సృష్టించాయని ఆరోపించారు. శరణార్థులకు పౌరసత్వం ఇస్తామంటే ఆందోళన చేయడం సరికాదని హితవు పలికారు. ప్రధాని మోదీకి పెరుగుతున్న ఆదరణ చూడలేకే సీఏఏపై మతం రంగు పులుముతున్నారని దుయ్యబట్టారు. సీఏఏకు అనుకూలంగా బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 15న బహిరంగ సభ నిర్వహిస్తున్నామని లక్ష్మణ్‌ చెప్పారు. ఈ సమావేశంలో బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కాటం నర్సింహయాదవ్, ఇన్‌చార్జి కాసం వెంకటేశ్వర్లు, మంత్రి శ్రీనివాస్, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top