టీఆర్‌ఎస్‌ గెలిస్తే తెలంగాణకు మేలు

KTR Road Show in Medchal - Sakshi

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ఈ గట్టున రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న టీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తు ఉంటే.. ఆ గట్టున దేశాన్ని 50 ఏళ్లు పాలించి దోపిడీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఉంది. మల్కాజిగిరి ఎంపీ కోసం మేడ్చల్‌ ఓటర్లు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.– మేడ్చల్‌ రోడ్‌షోలో కేటీఆర్‌

మేడ్చల్‌/మేడ్చల్‌రూరల్‌: ఈ గట్టున రాష్ట్రాన్ని సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దేశంలో నెంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతున్న టీఆర్‌ఎస్‌ పార్టీ కారు గుర్తు ఉంటే.. ఆ గట్టున దేశాన్ని 50 ఏళ్లు పాలించి దోపిడీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ ఉందని.. మల్కాజిగిరి ఎంపీ కోసం మేడ్చల్‌ ఓటర్లు ఏ గట్టున ఉంటారో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని  టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. బుధవారం సాయంత్రం మేడ్చల్‌లో ఆయన మంత్రి మల్లారెడ్డి, స్థానిక అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, మేయర్‌ బొంతు రామ్మోహన్‌తో కలిసి రోడ్‌షోలో పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుత ఎన్నికలకు టీఆర్‌ఎస్‌కు సంబంధం లేదని కాంగ్రెస్, బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని, కాంగ్రెస్‌ గెలిస్తే రాహుల్‌ గాంధీకి లాభమని, బీజేపీ గెలిస్తే మోదీకి లాభం చేకూరుతుందన్నారు. తెలంగాణలో కారు..సారు..16 నినాదంతో 16 ఎంపీ స్థానాలను గెలిపించుకుంటే తెలంగాణకు లాభం జరుగుతుందన్నారు.

దేశంలో విభిన్న రాజకీయాలు నడుస్తున్నాయని, ‘జిస్కా లాఠీ.. ఉస్కా బైన్స్‌’ అన్న చందంగా ఉందన్నారు. ఏ పార్టీవారు ఎక్కువ ఎంపీలుగా ఉండి మంత్రులై వారి రాష్ట్రాలకే ప్రాజెక్టులు తీసుకెళ్తున్నారని, దానికి ఉదాహరణనే మమత, లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు రైల్వే మంత్రులుగా పనిచేసి వారి ఇళ్ల వరకు రైళ్లు వేయించుకున్నారన్నారు. ప్రధాని మోదీ ఢిల్లీ నుండి తమ సొంత రాష్ట్రం గుజరాత్‌కు బుల్లెట్‌ ట్రైన్‌ వేయించుకున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బలవంతంగా తెలంగాణలోని ఏడు మండలాలను లాక్కున్నారన్నారు. తెలంగాణ రైతాంగ సాగునీటి కష్టాలు తీర్చడానికి రూ.80 వేల కోట్లతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని రెండున్నర ఏళ్లుగా అడుగుతున్నా ప్రధాని ఏనాడు సహకరించలేదన్నారు. నీతి ఆయోగ్‌ తెలంగాణలో చేపట్టిన మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ ప్రాజెక్టులకు రూ.24 వేల కోట్లు ఇవ్వమని సూచించినా మోదీ సర్కార్‌ మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

రెండు సీట్లతో తెలంగాణ సాధించిన కేసీఆర్‌కు 16 ఎంపీ స్థానాలు ఇస్తే రాష్ట్రాన్ని, దేశాన్ని ఎలా నడిపిస్తారో ఓటర్లు ఆలోచించాలని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డిని ఓటర్లు చిత్తుగా ఓడించారని కొడంగల్‌లో చెల్లని రూపాయి మేడ్చల్, మల్కాజిగిరిలో ఎలా చెల్లుతుందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ మల్కాజిగిరి అభ్యర్థిగా మంచి వ్యక్తిని పెడితే తాము గౌరవించే వాళ్లమని.. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగను పెడితే ప్రజలు ఎలా ఆదరిస్తారన్నారు. రేవంత్‌రెడ్డి పదేపదే తన మాటల్లో ప్రజల తరుఫున ప్రశ్నించే గొంతుకనవుతానని చెబుతున్నారని, అసలు ఆయన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రశ్నిస్తారా అని వ్యగ్యంగా విమర్శించారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం మినీ భారతదేశం వంటిదని, అందుకే అందరికోసం పనిచేసే యువకుడు, విద్యావేత్త మర్రి రాజశేఖర్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. మేడ్చల్‌లో డిగ్రీ కళాశాల ఏర్పాటు, రైల్వే అండర్‌ బ్రిడ్జి లాంటి సమస్యలను పరిష్కరించే బాధ్యత మంత్రి మల్లారెడ్డిదేనని, అందుకు తాను సహకారం అందిస్తానన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top