కారు..సారు

KTR Road Show in Chaitanyapuri - Sakshi

     ఎల్బీనగర్‌ రోడ్‌షోలో కేటీఆర్‌

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సోమవారం రాత్రిఎల్బీనగర్‌ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు.మల్కాజిగిరి లోక్‌సభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. పార్లమెంటులో రెండు సీట్లు ఉన్నప్పుడే కేసీఆర్‌ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని,ఈ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లు గెలిస్తే తెలంగాణ ప్రజల వాణి ఢిల్లీలో వినిపిస్తారన్నారు.

చైతన్యపురి: దక్షిణాది రాష్ట్రాల్లో పట్టుమని పది సీట్లులేని కాంగ్రెస్, బీజేపీలు జాతీయ పార్టీలు కాదని అవి జాతికి ద్రోహం చేసే పార్టీలు అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గం గడ్డిఅన్నారం డివిజన్‌లోని పీఅండ్‌టీ కాలనీ పోస్ట్‌ ఆఫీస్‌ చౌరస్తాలో సోమవారం జరిగిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. మల్కాజ్‌గిరిలో లోకసభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పార్లమెంట్‌లో రెండు సీట్లు ఉన్నప్పుడే కేసీఆర్‌ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, ఈ ఎన్నికల్లో 16 సీట్లు గెలిపిస్తే తెలంగాణ గొంతును వినిపిస్తారని అన్నారు. కాంగ్రెస్, బీజేపిలకు ఓటువేస్తే రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదన్నారు.  నీతిఅయోగ్‌ తెలంగాణలోని ప్రాజెక్టులకు 24 వేల కోట్లు ఇవ్వమని  సూచిస్తే కేంద్ర ప్రభుత్వం 24 రూపాయలు కూడా ఇవ్వలేదని అన్నారు. డబ్బుకట్టలతో అడ్డంగా దొరికిన వ్యక్తి కాంగ్రెస్‌ పార్టీ మల్కాజ్‌గిరి లోక్‌సభ అభ్యర్థిగా ఉన్నాడని, నేరస్థుడికి ఓటువేస్తారో లేక విద్యావంతుడు, ప్రజాసేవచేసే టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటు వేస్తారో ఆలోచించుకోవాలని ప్రజలకు కోరారు.

ఎల్‌బీనగర్‌లో రిజిస్ట్రేషన్ల సమస్య, పండ్ల మార్కెట్‌ తరలింపు, ఇంటి పన్ను సమస్యలను మూడు నెలల్లో క్యాబినెట్‌ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మల్కాజ్‌గిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, మేయర్‌ బొంతు రామ్మోహన్, టీఆర్‌ఎస్‌ ఎల్‌బీనగర్‌ ఇన్‌చార్జి రామ్మోహన్‌గౌడ్, ఎన్నికల పరిశీలకుల శశిధర్‌రెడ్డి, కట్టెల శ్రీనివాస్, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top