టీఆర్‌ఎస్‌పై భ్రమలు పోతున్నాయి: కోదండరాం

Kodandaram slams TRS government  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పాలనపై అన్నివర్గాలకు భ్రమలు పోయినట్టేనని తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం అన్నారు. ఆర్టీసీ జేఏసీ నేత ఆనందం నేతృత్వంలో పలువురు నేతలు శనివారం టీజేఎస్‌లో చేరారు. జన సమితిలో చేరిన వారికి కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలను విస్మరించారని విమర్శించారు. వ్యవసాయం సంక్షోభంలోకి కూరుకుపోయిందని, రైతుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడంలో విఫలమైందన్నారు.

విద్య, వైద్యం వంటి మౌళికరంగాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ఉద్యమంలో అగ్రభాగాన ఉండి, రాష్ట్ర సాధనకోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను సీఎం కేసీఆర్‌ అవమానిస్తున్నారని కోదండరాం విమర్శించారు. రైతులు, యువకులు, విద్యార్థులు, ఉద్యోగులతోసహా ఏ వర్గం అయినా తమ సమస్యల పరిష్కారంకోసం విన్నవించే అవకాశం, నిరసనను వ్యక్తం చేసే వేదిక కూడా లేకుండా పోయిందన్నారు. ఇంత నియంతృత్వంగా ప్రభుత్వం, పాలన ఉంటుందని ఎవరూ ఊహించలేదన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు ప్రొఫెసర్‌ పి.ఎల్‌.విశ్వేశ్వర్‌రావు, డి.పి.రెడ్డి, వెంకటరెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top