హిమాచల్‌లో ఉత్కంఠకు తెర | Sakshi
Sakshi News home page

హిమాచల్‌ కొత్త సీఎం జైరాం ఠాకూర్‌

Published Sun, Dec 24 2017 2:23 PM

Jairam Thakur is the new Himachal Pradesh chief minister - Sakshi

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెర పడింది. కొత్త సీఎంగా జైరాం ఠాకూర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం బీజేపీ కేంద్ర కమిటీ సభ్యుల అధ్యక్షతన జరిగిన ఆ పార్టీ ఎమ్మెల్యేల సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. జైరాం ఠాకూర్‌ను తమ నాయకుడిగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారని కేంద్ర పరిశీలకుడు నరేంద్ర సింగ్‌ తోమర్‌ అధికారికంగా ప్రకటించారు.

తాజాగా జరిగిన హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచినప్పటికీ ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రేమ్‌ కుమార్‌ ధూమల్‌ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిగా కొత్త అభ్యర్థిని ఎంపిక చేయాల్సివచ్చింది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేరు వినిపించినప్పటికీ చివరికి జైరాం ఠాకూర్‌ సీఎం పీఠాన్ని దక్కించుకున్నారు. వివాదరహితుడిగా పేరున్న ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాజ్‌పుత్‌ సామాజిక వర్గానికి చెందిన ఆయన 2007 నుంచి 2012 వరకు హిమాచల్‌ప్రదేశ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పనిచేశారు.

బీజేపీ ఎమ్మెల్యేల సమావేశంలో జైరాం ఠాకూర్‌ పేరును ధూమల్‌ ప్రతిపాదించడం విశేషం. తన పేరును ధూమల్‌ ప్రతిపాదించగా జేపీ నడ్డా, శాంతకుమార్‌ మద్దతు తెలిపారని జైరాం ఠాకూర్‌ తెలిపారు. తనకు మద్దతు తెలిపిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

హిమాచల్‌లో ఉత్కంఠకు తెర
 

Advertisement
Advertisement