
మాణిక్యపురంలో వైఎస్ జగన్ వెంట నడుస్తున్న జనవాహిని , బల్లిపుట్టుగలో భావోద్వేగానికి గురైన అవ్వను ఓదార్చుతున్న వైఎస్ జగన్
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అన్నా.. మాకు సాగు, తాగు నీరు లేదు.. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందడం లేదు.. చదువుకోవాలన్న కాంక్ష ఉన్నా స్థోమత లేదన్నా.. అర్హతలున్నా పింఛన్ ఇవ్వడం లేదు.. భూమి ఇచ్చారుగానీ పట్టాలివ్వలేదు.. ఉద్యోగాలు రావడం లేదన్నా.. అంటూ పలు వర్గాల ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. డయాలసిస్ వసతి పెంచాలని కిడ్నీ వ్యాధిగ్రస్తులు విజ్ఞప్తి చేశారు. వైఎస్ జగన్ పాదయాత్ర 339వ రోజు సోమవారం కంచిలి, కవిటి మండలాల్లోని తలతంపర క్రాస్ మాణిక్యపురం, చినబల్లి పుట్టుగ, బల్లిపుట్టుగ, కుసుమపురం, వరక, బొరివంక, బెజ్జిపుట్టిగ మీదుగా జగతి వరకూ సాగింది. ప్రజా సంకల్ప యాత్ర మరో రెండు రోజుల్లో ముగుస్తున్న నేపథ్యంలో వినతులు వెల్లువెత్తాయి. జన్మభూమి కమిటీల దాష్టీకాలు, అధికార పార్టీ ఎమ్మెల్యేల వేధింపులపై ఫిర్యాదులొచ్చాయి. వందలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు వైఎస్ జగన్‌ను కలిసి తమను ఆదుకోవాలని కోరారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ఉద్దానం కిడ్నీ వ్యాధి బాధలకు తోడు.. తిత్లీ తుపాను వచ్చి తమ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిందని.. పరిహారం చెల్లింపులో మోసాలు, రాజకీయ వివక్ష స్పష్టంగా కనిపిస్తోందని పలువురు ప్రతిపక్ష నేత ఎదుట వాపోయారు. అందరి సమస్యలు ఓపికగా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే అందరికీ మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు.
వెల్లువెత్తిన ఉద్దానం
కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెద్ద సంఖ్యలో ఉన్న ఉద్దానం ప్రాంతంలోనూ వైఎస్ జగన్‌కు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజల నుంచి ఆదరాభిమానాలు వెల్లువెత్తాయి. ఆయనను కలిసి సంఘీభావం తెలపడానికి గ్రామాల్లో జనం పోటీపడ్డారు. ఒక చోటకు మించి మరో చోట మహిళలు ఆయనకు నీరాజనాలు పట్టారు. అభిమానాన్ని చాటారు.
జగన్‌ను కలిసిన తెలంగాణ నేతలు
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర పార్టీ నేతలు పలువురు ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్ జగన్‌ను కలిసి సంఘీభావం తెలిపారు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ప్రపుల్లరెడ్డి, బి.అనిల్‌కుమార్, జీహెచ్‌ఎంసీ అధ్యక్షుడు బొడ్డు సాయినాథ్‌రెడ్డి, రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు బండారు వెంకటరమణ, రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు నాగదేశి రవికుమార్ తదితరులు.. జగన్‌తో పాటు కొద్ది దూరం పాదయాత్రలో నడిచారు.
బెంతో ఒరియాల సమస్యకు శాశ్వత పరిష్కారం
దీనిపై వైఎస్ జగన్ స్పందిస్తూ .. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే బెంతో ఒరియాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ సైతం తమ సమస్యపై అప్పట్లో కమిటీ వేసి పరిష్కారం చూపే ప్రయత్నం చేశారని, ఆయన మరణానంతరం తమను పట్టించుకున్న వారు లేరని, టీడీపీ ప్రభుత్వం వచ్చాక స్టేటస్‌కోను సైతం రద్దు చేసిందన్నారు. జగన్‌ను సీఎంను చేసేందుకు కష్టించి పనిచేస్తామన్నారు.
వైఎస్సార్‌సీపీలోకి శివరామరాజు
శ్రీకాకుళం అర్బన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ జిల్లాకు చెందిన ప్రముఖ క్షత్రియ నాయకుడు, విద్యావేత్త సూరపురాజు శివరామరాజు సోమవారం ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయనకు వైఎస్ జగన్ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన ఈ తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి, అక్రమాలకు పాల్పడుతోందన్నారు. నిత్యం ప్రజల్లోనే ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేస్తున్న వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు కృషిచేస్తామని శివరామరాజు చెప్పారు.
కులధ్రువీకరణ పత్రాలు ఇప్పించరూ..
పోలాకి: ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు కొండప్రాంత గిరిజనులుగా గుర్తింపబడి.. ఆ తర్వాత క్రమేణా మైదానప్రాంత గిరిజనులుగా ఉన్న బెంతో ఒరియాలకు ప్రస్తుతం కులధ్రువీకరణ పత్రాలివ్వడం లేదని ఆ సంఘం నాయకులు వైఎస్ జగన్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం మాణిక్యపురం గ్రామం వద్ద బెంతో ఒరియా ఎంప్లాయీస్ సంఘం అధ్యక్షుడు సరోజ్‌కుమార్ జెన్నా ఆధ్వర్యంలో సంఘం నాయకులు వైఎస్ జగన్‌కు వినతిపత్రం ఇచ్చారు. కవిటి, కంచిలి, ఇచ్ఛాపురం మండలాల్లో దాదాపు 30 వేల మంది బెంతో ఒరియాలున్నట్లు తెలిపారు. ఇక్కడ రాజకీయాల్లో పోటీచేసేందుకు ఎస్టీలుగా కులధ్రువీకరణ పత్రాలిస్తున్నారని.. అయితే తమ పిల్లల చదువులకు, ఉద్యోగాలకు అవసరమైనపుడు మాత్రం ఎస్టీలుగా కులధ్రువీకరణ పత్రాలివ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
పింఛన్ రాకుండా జన్మభూమి కమిటీలు అడ్డుకుంటున్నాయన్నా..
అన్నా.. నేను లారీ డ్రైవర్‌గా జీవనం సాగించేవాడిని. 2010లో రోడ్డు ప్రమాదంలో కాలు పోయింది. సదరంలో 60 శాతం దివ్యాంగ ధ్రువీకరణ పత్రం అందజేశారు. 2014 నుంచి పింఛన్ కోసం దరఖాస్తు చేస్తూనే ఉన్నా. అయినా పింఛన్ ఇవ్వకుండా జన్మభూమి కమిటీలు అడ్డుకుంటున్నాయి.
– పెద్దిరెడ్డి వేంకటేశ్వర్లు, విజయవాడ, కృష్ణాజిల్లా
అన్నా.. మీరు రాస్తున్న డైరీ ఆకట్టుకుంటోంది
అన్నా.. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ 2017 నవంబర్ 6 నుంచి నేటి వరకు సాగిన ప్రజా సంకల్ప యాత్ర ఓ చరిత్ర. అందులో భాగంగా మీరు తెలుసుకుంటున్న ప్రజా సమస్యలపై స్పందిస్తూనే ప్రభుత్వ తీరును ఎండగడుతూ రాస్తున్న డైరీ రాష్ట్ర ప్రజలను ఆకట్టుకుంది. అందుకే పాదయాత్ర తొలిరోజు నుంచి మీరు రాస్తున్న డైరీని సేకరిస్తూ ఓ పుస్తకంలా తయారు చేశాం. అది మీకు ఇచ్చేందుకు వచ్చాం. – గూట్ల విమల, నిర్మల, భీమవరం.. పశ్చిమగోదావరి జిల్లా
మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించండి..
సార్.. కిడ్నీ బాధితులు ఎక్కువగా ఉన్న ఉద్దానం ప్రాంతంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. ప్రత్యేకంగా నెఫ్రాలజీ యూనిట్, వైద్యులు, డయాలసిస్ కేంద్రం, రక్తనిల్వల కేంద్రం, ఐసీయూ సెటప్‌తో కూడిన ప్రత్యేక వైద్యశాలను కవిటిలో ఏర్పాటుచేయాలి. మీరు అధికారంలోకి వచ్చాక చర్యలు చేపట్టండి..
– డాక్టర్ పూడి రామారావు, వైద్య సలహాదారు, ఉద్దానం ఫౌండేషన్, బల్లిపుట్టుగ