
సాక్షి, విశాఖపట్నం : దేశం విడిచిపోతానంటూ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలపై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ మండిపడ్డారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. దేశం గురించి ఇలా మాట్లాడడం సిగ్గు చేటన్నారు. శనివారం ఆయన సుజనా చౌదరిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. రాజ్యాంగాన్ని అవమానపరిచే రీతిలో మాట్లాడిన సుజనాపై దేశ ద్రోహం కింద కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. అలాగే సుజనా పాస్‌పోర్టును సీజ్ చేయాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. చంద్రబాబును కాపాడుకోవడానికి తనతో పాటు, బినామీల ఆస్తులను కాపాడుకోవడానికే దేశాన్ని కించపరిచే రీతిలో వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ. పదివేల కోట్లను బ్యాంకులకు ఎగనామం పెట్టి.. విజయమాల్యా, నీరవ్ మోదీ తరహాలో సుజనా కూడా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.