పంచాయతీ పోరుకు కసరత్తు!

government ready for panchayath  Local election

ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు

నవంబర్‌లో ఓటర్ల జాబితా ప్రకటన

వచ్చే జూన్, జూలై నెలల్లో ఎన్నికలకు అవకాశం!

స్థానిక ఎన్నికల పోరుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 2013లో కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గాల గడువు వచ్చే ఏడాది ఆగస్టు రెండో తేదీతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో వీటికి వచ్చే ఏడాది జూన్, జూలై నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని సర్కార్‌ యోచిస్తోంది. ఇందులో భాగంగా అన్ని గ్రామాల్లోనూ నవంబర్‌ 30వ తేదీలోగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలంటూ తాజాగా పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ నుంచి జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయానికి ఆదేశాలు చేరాయి.

అరసవల్లి: పంచాయతీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని సర్కార్‌ ఆదేశించి.. ఎన్నికలు ఖాయమనే సంకేతాలను పంపించింది. దీంతో అధికారులు ఓటర్ల జాబితా తయారీకి సన్నద్ధమవుతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 243 (3 ఏ) ప్రకారం పంచాయతీరాజ్‌ సంస్థల ప్రస్తుత పదవీకాలం ముగియకముందే ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు వీలుంది. సెక్షన్‌ 13(2) ప్రకారం గడువుకు మూడు నెలల ముందే ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి అధికారాలున్నాయి. రాజ్యాంగం కల్పించిన ఈ వెసులుబాటు ఆధారంగా గడువు కంటే ముందుగానే ఎన్నికల ప్రక్రియను చేపట్టేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. పోలింగ్‌ సిబ్బంది, బ్యాలెట్‌ బాక్సుల లభ్యత మేరకు వివిధ దశల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఈసీ భావిస్తోంది. అయితే ప్రస్తుతం పంచాయతీలకే ఎన్నికలు నిర్వహిద్దామని, ఆ తర్వాతే మిగిలిన స్థానికఎన్నికలకు (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికలు నిర్వహిద్దామనేఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.

ఆ ఏడు పంచాయతీలు దూరమే..!
జిల్లాలో 2013లో మొత్తం 1100 పంచాయతీలకు గాను, 1099 పంచాయతీలకు, 10,542 వార్డులకు ఎన్నికలు జరిగాయి. శ్రీకాకుళం మున్సిపాలిటీలో నగరానికి శివారు పంచాయతీలను విలీనం చేసే క్రమంలో పెద్దపాడు పంచాయతీలో ఎన్నికలు జరగలేదు. దీంతో ఇప్పటికీ అక్కడ స్పెషల్‌ ఆఫీసర్‌ పాలనే కొనసాగుతుంది. దీంతో ఈసారి మరో కీలకమైన భూసేకరణ మార్పులతో అటు రణస్థలం మండలంలో కొవ్వాడ అణువిద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం కారణంగా కొవ్వాడ పంచాయతీ పూర్తిగా మెర్జ్‌ అయ్యింది. అలాగే తాజాగా హిరమండలం పరిధిలోని చిన్న కొల్లివలస, పెద్ద సంకిలి, శిలగాం, దుగ్గిపురం, గార్లపాడు, పాడలి తదితర 6 పంచాయతీలు కూడా వంశధార ప్రాజెక్టు భూసేకరణ కారణంగా మెర్జ్‌ కానున్నాయి. దీంతో ఈ ఏడు పంచాయతీలు ఈసారి ఎన్నికలకు దూరం కావచ్చనే అభిప్రాయం దిగువస్థాయి అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. అయితే దీనిపై ఉన్నతాధికారుల నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీంతో తాజా పరిస్థితుల ప్రకారం ఈసారి 1093 పంచాయతీల్లోనే ఎన్నికలు జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇదిలాఉంటే 2013æ ఎన్నికల తర్వాత జిల్లాలో కొన్నేళ్లుగా 36 పంచాయతీల సర్పంచులు, 221 వార్డు సభ్యుల స్థానాలు వివిధ కారణాలుగా ఖాళీలుగానే ఉన్నాయి. ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం గత రెండేళ్లుగా వాయిదాలు వేస్తూ వచ్చింది. దీంతో ఖాళీలుగా ఉన్న స్థానాలతో పాటు ప్రస్తుత పాలకవర్గాల స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నారు.

పెరగనున్న ఓటర్లు!
2013లో జిల్లాలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 16 లక్షల మంది ఓటర్లు నమోదు కాగా, ఈసారి సుమారు 17.50 లక్షల మంది వరకు చేరవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలను నవంబర్‌ 30వ తేదీ నాటికి సిద్ధం చేయాలంటూ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ రామాంజనేయులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు అందుకు తగ్గట్టుగా సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలో 2018 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారికి ఓటు హక్కు కల్పించనున్నారు. పంచాయతీల్లో అన్ని వార్డుల్లోనూ సమానంగా ఓటర్లను విభజించాల్సి ఉంది. గతంలో మాదిరిగా ఈసారి కూడా వార్డుకో పోలింగ్‌ బూత్‌ ఉండేలా ఆదేశాలు జారీ అయ్యాయి. వేసవి సెలవులు పూర్తయ్యేలోగానే ఎన్నికలు తంతు ముగించాలనే ఆలోచనలో అధికారులున్నారు. ఈ కారణంగానే నవంబర్‌ నెలాఖరుకు పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను రూపొందించడం, 2018 మార్చి 15 నాటికి ముద్రణ పనులు పూర్తి చేయాలని తాజాగా వచ్చిన ఆదేశాల్లో  పీఆర్‌ కమిషనర్‌ స్పష్టం చేశారు.

ఏప్రిల్‌ 16వ తేదీ లోగా రిజర్వేషన్లు ఖరారు!
వచ్చే ఏడాది ఏప్రిల్‌ 16వ తేదీలోగా రిజర్వేషన్లను డివిజనల్‌ ఎన్నికల అధికారులైన ఆర్డీవోలు ఖరారు చేస్తారు. చట్ట ప్రకారం 50 శాతం పంచాయతీలు, వార్డులను మహిళలకు, అదేవిధంగా జనాభా దామాషా ప్రకారం రొటేషన్‌ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. ఏప్రిల్‌ 17వ తేదీలోగా పోలింగ్‌ స్టేషన్ల ఏర్పాటు పూర్తి చేసి జూన్‌ నుంచి జూలైలోగా ఎప్పుడైనా ఎన్నికల నిర్వహణను ముగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా స్పష్టమవుతోంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top