
సోంపేట రోడ్డులో వైఎస్ జగన్ అడుగులో అడుగులేస్తున్న జనవాహిని, చిన్నారితో ఆప్యాయంగా..
ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమ భూములను టీడీపీ నేతలు ఆక్రమించేస్తున్నారంటూ మత్స్యకారులు, తిత్లీ తుపానుకు తీవ్రంగా నష్టపోయినా ఇంతవరకూ పరిహారం ఇవ్వలేదంటూ బాధితులు, డయాలసిస్ వసతి సామర్థ్యాన్ని పెంచాలంటూ కిడ్నీ వ్యాధిగ్రస్తులు.. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులమని సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని పలువురు బాధితులు.. ఇలా వివిధ వర్గాల ప్రజలు వైఎస్ జగన్ ఎదుట తమ కష్టాలు ఏకరవు పెట్టారు. టీడీపీ పాలనలో అష్టకష్టాలు పడుతున్నామని, మీరొస్తేనే మాకు మంచి జరుగుతుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 338వ రోజు ఆదివారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం సోంపేట, కంచిలి మండలాల్లోని లక్కవరం, జింకిబద్ర, బంజరునారాయణపురం, ఇసుకలపాలెం, తలతంపర, మజ్జిపుట్టిగ గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా పలు వర్గాల ప్రజలు తమ కష్టాలను వైఎస్ జగన్ ఎదుట ఏకరవుపెట్టారు.
ప్రతిపక్ష నేతకు సమస్యల నివేదన
బారువ కొత్తూరు గ్రామంలో మత్స్యకారులకు చెందిన 40 ఎకరాలను టీడీపీ నేతలు ఆక్రమించారంటూ ఆ ప్రాంత మత్స్యకారులు వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాగానే తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. మొన్నటి తిత్లీ తుపానుకు తీవ్రంగా నష్టపోయిన బాధితులు వైఎస్ జగన్‌ను కలిసి.. తమకు ఇంత వరకు పరిహారం ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. పార్టీ వివక్ష చూపుతూ ఈ టీడీపీ ప్రభుత్వం దివ్యాంగులకు కూడా పింఛన్‌లు ఇవ్వడం లేదంటూ బారువ కొత్తూరుకు చెందిన భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో అందుబాటులో ఉన్న డయాలసిస్ వసతి సామర్థ్యాన్ని పెంచాలని ప్రతిపక్ష నేతకు విజ్ఞప్తి చేశారు. ఇంకా పలువురు బాధితులు తమ సమస్యలపై వినతిపత్రాలు, ఫిర్యాదులు అందించారు. అందరి సమస్యలు సావధానంగా విన్న జగన్.. మనందరి ప్రభుత్వం రాగానే అందరి కష్టాలు తీరతాయని హామీ ఇచ్చారు. దళిత మహానాడు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు తరలివచ్చి వైఎస్ జగన్‌కు మద్దతు ప్రకటించారు. ఆయన అధికారంలోకి వస్తేనే బడుగు, బలహీనవర్గాలకు సంక్షేమ కార్యక్రమాలు పెద్దఎత్తున అమలవుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
కిక్కిరిసిన సోంపేట
వైఎస్ జగన్ పాదయాత్ర సోంపేట మండల కేంద్రానికి చేరుకున్నప్పుడు జనం పోటెత్తారు. వీధులన్నీ కిక్కిరిసి పోయాయి. పొరుగునే ఉన్న పలాస అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గౌతు శ్యాంసుందరశివాజీ సొంత మండలం అయిన ఈ మండల కేంద్రంలో.. జగన్ రాకకు కొన్ని గంటల ముందు నుంచే ఆయన కోసం ఎదురు చూశారు. వైఎస్ జగన్ వారి సమీపానికి రాగానే.. ప్రజలు మరింత ముందుకొచ్చి ఆయనను కలిసేందుకు ఉత్సాహం చూపారు. యువత, అక్కచెల్లెమ్మలు ప్రతిపక్ష నేతతో సెల్ఫీలు దిగి తమ సంతోషాన్ని, సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. టీడీపీకి పట్టున్న ఈ ప్రాంతంలో జగన్‌పై ప్రజాభిమానం కట్టలు తెంచుకుంది. ఆ ప్రాంతంలో ఎటుచూసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బెలూన్లే.. ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే. యువత ఉత్సాహంగా కేరింతలు కొడుతూ జై జగన్.. నినాదాలతో హోరెత్తించారు.
ఖాతాలేని బ్యాంకులో తిత్లీ పరిహారాన్ని వేశారట
నాకు ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్‌లో ఖాతా లేదు. యాప్ కూడా డౌన్‌లోడ్ చేసుకోలేదు. నెట్ బ్యాంకింగ్‌పై అవగాహన లేదు. తిత్లీ తుపానుకు నాలుగెకరాల కొబ్బరితోట దెబ్బతింది. నష్ట పరిహారం రూ.1.24 లక్షలు మంజూరైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నా ఖాతా నంబర్ ఇచ్చాను. నా ఎయిర్‌టెల్ నెట్‌వర్క్ ఆధారంగా పేమెంట్ బ్యాంక్‌లో నష్టపరిహారం జమచేసినట్లు అధికారులు చెబుతున్నారు. పేమెంట్ బ్యాంక్ ఖాతా లేకుండా ఎలా జమ చేశారో అర్థ కావడం లేదు. అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా స్పందించడం లేదు.
– నలియా నారాయణ, బంజిరి నారాయణపురం, కంచిలి మండలం
టీడీపీ హయాంలో ఉద్యోగాల భర్తీ లేదు..
అన్నా.. టీడీపీ హయాంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదు. బీఎస్సీ నర్సింగ్ హోం, విశాఖపట్నంలో ఎంపీహెచ్‌డబ్ల్యూ విభాగంలో శిక్షణ పూర్తిచేశాను. ఇంతవరకూ ఉద్యోగం రాలేదు. ఆరోగ్యశాఖలో ఖాళీలను భర్తీచేసి నిరుద్యోగులను ఆదుకోవాలి.
– తమరాన శిరీష, పలాసపురం, సోంపేట మండలం
దౌర్జన్యం చేసి భూములను ఆక్రమిస్తున్నారు
అన్నా.. టీడీపీ నాయకులు దౌర్జన్యం చేసి మత్స్యకారులకు చెందిన భూములను ఆక్రమించుకుంటున్నారు. మా గ్రామంలో 40 ఎకరాలను ఆక్రమించారు. దివ్యాంగురాలినైన నేను వైఎస్సార్‌సీపీ అభిమానులమని పింఛన్ కూడా రానివ్వకుండా చేస్తున్నారు. మీ నాన్నగారు వైఎస్సార్ హయాంలో పింఛన్ మంజూరైంది. తర్వాత టీడీపీ హయాంలో తొలగించారు.
– అమర భాగ్యలక్ష్మి, బారువ కొత్తూరు, సోంపేట మండలం