1,114 వాట్సాప్‌ గ్రూప్‌లకు అడ్మిన్‌

Dipak Das Admin Of Over Thousand WhatsApp Groups - Sakshi

కోల్‌కతా: రాజకీయ పార్టీలు ప్రచారానికి నూతన మార్గాలు ఎంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సార్వత్రిక ఎన్నికల్లో సోషల్‌ మీడియా వేదికగా అన్ని రాజకీయా పార్టీలు ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. అంతేకాకుండా ప్రత్యర్థులపై విమర్శలు సంధిస్తున్నాయి. ఇందుకోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేసుకున్నాయి. అయితే సామాజిక మాధ్యమాలు వాడకంలో బీజేపీ చాలా ముందు వరుసలో ఉందనే చెప్పవచ్చు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ పేరు దేశ వ్యాప్తంగా పాపులారిటీ పొందడంలో సోషల్‌ మీడియా ద్వారా జరిగిన ప్రచారం కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. బీజేపీ అధినాయకత్వమే కాకుండా కింది స్థాయి నాయకులు కూడా సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఇందుకోసం ఆ పార్టీ ఐటీ విభాగం వారికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. అలా శిక్షణ పొందిన వారిలో పశ్చిమ బెంగాల్‌కు చెందిన దీపక్‌ దాస్‌ ఒకరు. ఈయన కూచ్‌ బెహర్‌ జిల్లాలో సోషల్‌ మీడియా సాయంతో బీజేపీ ప్రచారం చేస్తారు. ఇందులో విశేషం ఏముందని అనుకుంటున్నారా?. అయితే దీపక్‌ ఏకంగా  1,114 వాట్సాప్‌ గ్రూపులకు అడ్మిన్‌గా ఉన్నారు. తను ఎక్కడ ఉన్న ఎక్కువగా తన రెండు సెల్‌ఫోన్లను చూస్తునే ఉంటారు. కూచ్‌ బెహర్‌ ప్రాంతంలో బీజేపీ కీలక నాయకుల్లో దీపక్‌ దాస్‌ ఒకరు.

బీజేపీ జిల్లా ఐటీ సెల్‌ కన్వీనర్‌ ఉన్న దీపక్‌ మాట్లాడుతూ.. నేను 1,114 వాట్సాప్‌ గ్రూప్‌లకు అడ్మిన్‌గా ఉన్నాను. పార్టీకి చెందిన ఓ ఫేస్‌ బుక్‌ పేజీని నిర్వహిస్తాను. ట్విటర్‌ను కూడా వాడతాను. పశ్చిమ బెంగాల్‌ తృణమూల్‌ అరాచకాలను తట్టుకుని ప్రచారం చేయడానికి సోషల్‌ మీడియా బాగా ఉపయోగపడుతుంది. నేను ఒక ఫోన్‌ నంబర్‌ నుంచి 229 గ్రూపులకు, మరో నంబర్‌ నుంచి 885 గ్రూపులకు అడ్మిన్‌గా ఉన్నాను. ఒక్కో గ్రూపులో 30 నుంచి 250 మంది ఉంటారు. ఉదయం ఆరు గంటల నుంచి నేను ఇదే పనిలో ఉంటాను. పాకిస్తాన్‌పై ఎయిర్‌ స్ట్రైక్స్‌ జరిగిన సమయంలో మేము 24 గంటలు నిర్వీరామంగా పనిచేశాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము తొలుత ఇంటింటికి తిరిగాం. అప్పడు చాలా మంది చేతుల్లో స్మార్ట్‌ ఫోన్లు కనిపించాయి. అప్పుడు వారి నంబర్లు తీసుకున్నాం. పార్టీ మెంబర్‌ క్యాంపెయిన్‌ నుంచి మరికొన్ని నంబర్లు తీసుకున్నామ’ని తెలిపారు. 

కాగా, దీపక్‌ పన్నెండో తరగతి మాత్రమే చుదవుకున్నారు. ఆయనకు గోపాల్‌పూర్‌ ప్రాంతంలో ఓ చిన్న ఫార్మసీ ఉంది. 36 ఏళ్ల దీపక్‌కు భార్య, ఐదేళ్ల పాప ఉన్నారు. నరేంద్ర మోదీపై అభిమానంతో 2014లో బీజేపీలో చేరాడు. 2015లో ఓ అండ్రాయిడ్‌ ఫోన్‌ కోని సోషల్‌ మీడియాలో బీజేపీ కోసం పనిచేయడం ప్రారంభించారు.  కానీ ఈ ఏడాది దీపక్‌ బీజేపీ 10వేల రూపాయల విలువ కలిగిన సెల్‌ఫోన్‌ను అందజేసింది. ప్రస్తుతం కూచ్‌ బెహర్‌లో దీపక్‌ ఆధ్వర్యంలో 40 మంది బృందం పనిచేస్తోంది. అయితే దీపక్‌ ప్రచారం నిర్వహిస్తున్న కూచ్‌ బెహర్‌లో సార్వత్రిక ఎన్నికల తొలి దశలో భాగంగా గురువారం పోలింగ్‌ ముగిసింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top