కాంగ్రెస్‌ ప్రచారంలో ‘కాషాయ’ స్కార్ఫులు!

DIG Denies They Are Part of Force Who Wear Saffron Scarves at Digvijay Singh Road Show - Sakshi

భోపాల్‌ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, భోపాల్‌  ఎంపీ అభ్యర్థి దిగ్విజయ్‌ సింగ్‌ రోడ్‌షోలో మహిళా పోలీసలు కాషాయ రంగు స్కార్పులు ధరించడం పట్ల బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా డిగ్గీ రాజా బుధవారం రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు కాషాయ రంగు గల స్టోల్స్‌ ధరించారు. కాంగ్రెస్‌ నాయకుడి సభలో కాషాయ రంగు మెరవడంతో మీడియా ప్రతినిధుల దృష్టిని ఆకర్షించింది. దీంతో వెంటనే అక్కడున్న మహిళలను ప్రశ్నించగా.. వారిలో కొంతమంది తాము పోలీసులమని చెప్పగా.. మరికొందరు మాత్రం తమను తాము ఎండ నుంచి కాపాడుకోవడానికి స్టోల్స్‌ ధరించామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా జాతీయతకు ఈ రంగు చిహ్నమని పేర్కొన్నారు.

ఈ విషయంపై స్పందించిన బీజేపీ అధికార ప్రతినిధి రజనీశ్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. పోలీసులను తన రోడ్‌షో కోసం వాడుకుంటున్న దిగ్విజయ్‌ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి విఙ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ మాత్రం ఈ ఘటనను చిన్నదిగా చూపేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. దీంతో ఇరుపార్టీల నాయకులు విమర్శల యుద్ధానికి దిగారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన మధ్యప్రదేశ్‌ డీఐజీ ఇష్రాద్‌ వలీ.. సదరు మహిళలను తాము రిక్రూట్‌ చేసుకోలేదని.. వారు పోలీసులు కాదని స్పష్టతననిచ్చారు. వారు కేవలం వాలంటీర్లు మాత్రమేనని, డ్యూటీలో ఉన్న పోలీసులెవరూ కాషాయం ధరించరని పేర్కొన్నారు.

కాగా తన ప్రత్యర్థి అభ్యర్థి సాధ్వి ప్రఙ్ఞాసింగ్‌(బీజేపీ)ను బలంగా ఢీకొట్టేందుకు గత కొన్నిరోజులగా డిగ్గీరాజా హిందూవాదాన్ని ప్రధానంగా హైలెట్‌ చేస్తున్నారు. కంప్యూటర్‌ బాబాగా పేరుపొందిన సాధూ నామ్‌దేవ్‌ త్యాగి ఆధ్వర్యంలో ఆయన..మంగళవారం ఆసనాలు వేస్తూ ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు వివిధ సాధువులు ప్రజ్ఞా సింగ్‌ ఠాకూర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయనున్నారు. ఇక కంప్యూటర్‌ బాబాకు అప్పటి బీజేపీ ప్రభుత్వం నర్మదా పరిశుభ్రత ప్యానెల్‌లో సహాయ మంత్రి హోదా కట్టబెట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top