‘శ్రామిక్‌’ చార్జీలపై రాజకీయ దుమారం

Congress will pay for rail travel of migrant workers - Sakshi

వలస కార్మికుల తరలింపు ఖర్చును భరిస్తామన్న సోనియా

పీఎం–కేర్స్‌ నిధులను కార్మికుల కోసం వెచ్చించాలని సీపీఎం డిమాండ్‌

ప్రయాణ చార్జీలో రైల్వేలు 85 శాతం ఇస్తున్నాయని బీజేపీ వెల్లడి

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌తో ఇతర ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను స్వస్థలాలకు కేంద్రమే ఉచితంగా చేర్చాలని కొన్ని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేయడం, వారిని గమ్యస్థానాలకు చేర్చేందుకు అయ్యే ఖర్చును తాము భరిస్తామంటూ కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియా చేసిన ప్రకటన రాజకీయ దుమారం రేపింది. పీఎం–కేర్స్‌ నిధులను కార్మికుల కోసం వెచ్చించాలని సీపీఎం డిమాండ్‌ చేసింది. విపక్షం వ్యాఖ్యలపై అధికార బీజేపీ మండిపడింది. స్వస్థలాలకు తరలివెళ్లే వలస కార్మికుల టికెట్‌ ఖరీదులో రైల్వేలు 85 శాతం, రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా మొత్తాన్ని భరిస్తున్నాయని బీజేపీ తెలిపింది. బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ మహాపాత్ర, పార్టీ ఐటీ విభాగం బాధ్యుడు అమిత్‌ మాల్వీయ ట్విట్టర్‌లో పలు వ్యాఖ్యలు చేశారు. ‘వలస కార్మికుల కోసం రైల్వే శాఖ శ్రామిక్‌ రైళ్లు నడుపుతోంది. ఏ రైల్వేస్టేషన్‌లోనూ టికెట్లు విక్రయించడం లేదు. టికెట్‌ రుసుములో రైల్వేలు 85 శాతం సబ్సిడీ ఇస్తున్నాయి. మిగతా 15 శాతం రాష్ట్రాలు చెల్లిస్తున్నాయి. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు తమ వంతు చెల్లించేలా ఆ పార్టీ చీఫ్‌ సోనియా సూచించాలి’అని వారు కోరారు.

విపక్షం మండిపాటు
వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం టికెట్‌ చార్జీలు వసూలు చేస్తున్నందున, ఇకపై తమ పార్టీయే ఆ మొత్తాన్ని భరిస్తుందంటూ కాంగ్రెస్‌ చీఫ్‌ సోనియాగాంధీ సోమవారం ప్రకటించారు. దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న కార్మికులకు ఆమె సంఘీభావం ప్రకటించారు. ఈ విషయంలో సాయం కోసం ఎదురుచూస్తున్న వలస కార్మికులకు పార్టీ రాష్ట్రాల విభాగాలు  సాయం అందిస్తాయని తెలిపారు. ఈ అంశంపై సీపీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ కూడా స్పందించాయి. ‘పేరులో ఉన్నట్లే పీఎం–కేర్స్‌ నిధి కేవలం ప్రధాని సంబంధీకులదిగా మారింది. వలస కార్మికులను ఎన్నారైలు(నాన్‌ రిక్వైర్డ్‌ ఇండియన్స్‌)’అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top