టీఆర్‌ఎస్‌కు తోక పార్టీగా కాంగ్రెస్‌

Congress as tail party for TRS says Laxman - Sakshi

వారంతా ఏకమైనా బీజేపీ గెలుపును ఆడ్డుకోలేరు

సెప్టెంబర్‌ 17ను నిర్వహించి తీరుతాం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌

కేసీఆర్‌ నియంతృత్వాన్ని సమష్టిగా ఎదుర్కోవాలి: వివేక్‌  

సాక్షి, హైదరాబాద్‌: అన్ని రాష్ట్రాల్లో తోక పార్టీగా మారిపోతున్న కాంగ్రెస్‌ పార్టీ, తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తోక పార్టీగా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఇటీవల బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్‌ సోమ వారం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా వివేక్‌తో కలిసి లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ బిడ్డల బలిదానాలతో ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ఒక కుటుంబానికే పరిమితం అయిందన్నారు. టీఆర్‌ఎస్‌తో కలిసి కాంగ్రెస్‌ లాలూచీ రాజకీయాలు చేస్తోందన్నారు. ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సింది పోయి ప్రధాన అనుచర పార్టీగా మారిపోయిందన్నారు. కేటీఆర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇద్దరు కలిసి ఒకేలా మాట్లాడుతున్నారని, తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. 2023లో బీజేపీ గెలుపును ఉత్తమ్, కుంతియా, కేసీఆర్, కేటీఆర్‌ అంతా ఏకమైనా అడ్డుకోలేరన్నారు.

తెలంగాణ విమోచన దినాన్ని విస్మరిస్తున్న టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని బీజేపీ భావిస్తోందని, అమిత్‌ షా నేతృత్వంలో సెప్టెంబర్‌ 17ను నిర్వహించి తీరుతామన్నారు. బంగారు తెలంగాణ బీజేపీతోనే సాధ్యమని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. తెలంగాణ రావడం బీజేపీకి ఇష్టం లేదని దుష్ప్రచారం చేస్తున్నారని, సుష్మాస్వరాజ్‌ పార్లమెంటులో ఏం మాట్లాడారో ఉత్తమ్‌కి తెలియదా? అని ప్రశ్నించారు. బీజేపీకి తెలంగాణ నుంచి ఒక్క ఎంపీ లేకున్నా బీజేపీ ఎంపీలు ప్రత్యేక తెలంగాణ బిల్లుకు మద్దతుగా ఓటు వేశారన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలే ప్రాంతాలుగా విడిపోయిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్‌ తెలంగాణ సెంటిమెంటుతో పబ్బం గడుపుకోవ డం లేదా? రజాకార్ల వారసత్వంతో ఉన్న మతోన్మా ద మజ్లిస్‌ పార్టీని భుజానికి ఎత్తుకోవడం లేదా అని ప్రశ్నించారు. అక్బరుద్దీన్‌ హిందూ దేవుళ్లపై, దేవతలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే టీఆర్‌ఎస్‌ ఎందుకు నోరు మెదపలేదని, కనీసం కట్టడి చేయ డం లేదన్నారు. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తానని మాట ఇచ్చి తప్పింది మీ తండ్రి కాదా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. లౌకిక రాజ్యం అంటు న్న మీరు వందేమాతరం పాడను.. అంటున్న ఒవైసీ సోదరులను ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు.  

ప్రజాస్వామ్య తెలంగాణను మరచిన కేసీఆర్‌ 
మాజీ ఎంపీ వివేక్‌ మాట్లాడుతూ అందరం కలిసి తెలంగాణ కోసం పోరాడామన్నారు. కానీ ఇప్పు డు కేసీఆర్‌ ప్రజాస్వామ్య తెలంగాణను మరిచిపోయారన్నారు. కల్వకుంట్ల తెలంగాణ ఎలా చేసుకోవాలో ఆలోచిస్తున్నారన్నారు. ఉద్యమ సమయం లో ప్రజల గురించి మాట్లాడిన కేసీఆర్‌ గెలిచాక కొడుకు, కూతురు గురించి మాట్లాడడం మొద లు పెట్టారన్నారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన హరీశ్, కోదండరాం, జితేందర్‌రెడ్డిని అప్ప ట్లోనే పక్కనపెట్టాలని చూశారని పేర్కొన్నారు. ఎన్‌టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వారిలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కేసీఆర్‌ అని ఆరోపించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top