‘కల్వకుంట్ల రాజ్యాంగం చెల్లదు’

Congress Leaders Fire On KCR - Sakshi

పార్టీ విలీనం లేఖపై రేవంత్‌రెడ్డి  వ్యాఖ్య

హైదరాబాద్‌: కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యేల విలీనం లేఖపై ఎంపీ రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. అంబేడ్కర్‌ రచించిన రాజ్యాం గం చెల్లుతుందే గానీ కల్వకుంట్ల రాజ్యాంగం చెల్లదంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరిలో గురువారం ఆయన పర్యటించిన సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. ప్రగతిభవన్‌ను సీఎం అధికారికంగా ఉపయోగిస్తున్నప్పుడు కేటీఆర్‌ అక్కడ ఉండటమే తప్పన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ విందుకు ఆహ్వానించడం అధికార దుర్వినియోగమేనన్నారు. కేసీఆర్‌కు 88 ఎమ్మెల్యే సీట్లనిచ్చి గెలిపించారని అయితే ఆయన అభివృద్ధిపై కాకుండా ఫిరాయింపులపై దృష్టి సారిస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 70ఏళ్లలో పలు ప్రభుత్వాలు ప్రతిపక్షాలు లేకుండా పాలన సాగించలేకపోయాయన్నారు. ఎంపీ ఎన్నికల్లో పార్టీ ఫిరా యింపు చేయని వారినే గెలిపించారన్నారు. నిజామాబాద్, కరీంనగర్‌లో కర్రు కాల్చి ప్రజలు వాతపెట్టారని ఆ ఓటమి నుంచి టీఆర్‌ఎస్‌ పాఠాలు నేర్చుకోవాలన్నారు.

ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలి: పొన్నం 
కాంగ్రెస్‌ పార్టీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్‌ కొనుగోలు చేయడం సిగ్గుచేటని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఒక దళితుడు ప్రతిపక్ష నేతగా ఉండడాన్ని జీర్ణించుకోలేని టీఆర్‌ఎస్, ప్రతిపక్షం లేకుండా చేయడానికి కుట్ర చేస్తోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కోర్టులో అనర్హత పిటిషన్‌ పెండింగ్‌లో ఉండ గా విలీన ప్రక్రియ ప్రయత్నాలు చేయడమేమిటని ప్రశ్నించారు. దీనిపై మా ఎమ్మెల్యేలు నిరసనలు చేస్తే అరెస్టు చేసి కేసులు పెడతారా అని నిలదీశారు. గతంలో మేము చేసిన అనేక ఫిర్యాదులపై ఇప్పటివరకు స్పీకర్‌ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  
 
ఎవరు పార్టీలో ఉంటారో చెప్పలేని పరిస్థితి: విజయశాంతి  

 వేసే ఓట్లు ఏమౌతున్నాయో, ఓట్లు వేశాక గెలిచే అభ్యర్థులు ఎటు పోతారో అర్థం కాని అయోమయ పరిస్థితుల్లో తెలంగాణ ప్రజానీకం సతమతమవుతూ ఉందని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ విజయశాంతి పేర్కొన్నారు. గెలిచాక ఈ అభ్యర్థి మన పార్టీలోఉంటారా..? అనే కార్యకర్తల ఆవేదనకు సమాధానం చెప్పలేని స్థితిలో తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.   

విలీనంపై సుప్రీంని ఆశ్రయిస్తాం: కుసుమ కుమార్‌(టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కుసుమ కుమార్‌)
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీ సాక్షిగా చంపేశారని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమ కుమార్‌ విమర్శించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేకుండా 12 మంది ఎమ్మెల్యేలు సీఎల్పీ సమావేశం ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా సీఎల్పీ విలీన లేఖను స్పీకర్‌ ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ అప్రజాస్వామిక విధానాలపై సుప్రీంకోర్టుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top