‘లోక్‌సభ’ జాబితాను 20లోగా పంపండి

Congress announces election committees in states - Sakshi

రాష్ట్రాల ఎన్నికల కమిటీలకు కాంగ్రెస్‌ అధిష్టానం నిర్దేశం

ఎంపిక బాధ్యతల నుంచి స్క్రీనింగ్‌ కమిటీల తొలగింపు

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లను కాంగ్రెస్‌ వేగవంతం చేసింది. ఈనెల 20వ తేదీలోగా అభ్యర్థుల జాబితా పంపాలని అన్ని ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ(పీఈసీ)లకు శుక్రవారం సర్క్యులర్‌ జారీ చేసింది. అయితే, ఈసారి స్క్రీనింగ్‌ కమిటీలకు బదులు ప్రత్యేక కమిటీలకు ఎంపిక బాధ్యతలు అప్పగించింది. గతంలో ఎన్నికలప్పుడు రాష్ట్రాల స్థాయిలో స్క్రీనింగ్‌ కమిటీలు ఏర్పాటయ్యేవి. ఈ కమిటీలే అభ్యర్థులను ఎంపిక చేసి ఏఐసీసీకి పంపించేవి. తాజాగా ఈ విధానానికి స్వస్తి చెప్పారు.

లోక్‌సభ అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను ముందుగా ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ(పీసీసీ)లు రూపొందించి రాష్ట్ర స్థాయిలోని ప్రత్యేక కమిటీలకు అందజేస్తాయి. ఈ కమిటీల్లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి లేదా ఆ రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి, రాష్ట్ర పీసీసీకి కేటాయించిన ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ అధ్యక్షుడు, సీఎల్‌పీ నేత సభ్యులుగా ఉంటారు. వీరు పీసీసీ జాబితాను పరిశీలించి అవసరమైన మార్పులు చేర్పులతో ఏఐసీసీ స్థాయిలోని కేంద్ర ఎన్నికల కమిటీ(సీఈసీ)కి పంపుతారు.

తెరపైకి కొత్త విధానం
గతంలో స్క్రీనింగ్‌ కమిటీలు పంపిన జాబితాల్లో చాలాసార్లు.. ఎవరికీ పరిచయం లేని వ్యక్తులు, రాష్ట్రంపై అవగాహన లేని వారు, అసలు స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులకే తెలియని వారి పేర్లు కూడా ఉండేవని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. ఇటీవల జరిగిన రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా చోట్ల పెద్దగా పరిచయం లేని వ్యక్తులు పోటీలోకి దిగగా తిరుగుబాట్లు తలెత్తడం, స్థానిక నేతల సహాయ నిరాకరణ వంటివి జరిగాయని ఆ నేత తెలిపారు.

పార్టీ సీనియర్‌ నేతలు రాజకీయాలు చేస్తూ ఎవరికీ పరిచయం లేని వారికి కూడా స్క్రీనింగ్‌ కమిటీ జాబితాలో చోటు కల్పించే వారని అన్నారు. ఇలాంటప్పుడు భారీగా డబ్బు కూడా చేతులు మారేదని ఆరోపణలు వచ్చాయన్నారు. వీటన్నిటికీ చెక్‌ పెట్టేందుకు రాహుల్‌ గాంధీ కొత్త విధానాన్ని తెచ్చారని ఆ నేత తెలిపారు. రాష్ట్రాల స్థాయిలో కీలకమైన పార్టీ బాధ్యతలను నెరవేర్చేవారు, విధాన నిర్ణయాలను అమలు చేసేవారికి ఎంపికలో బాధ్యతలు అప్పగిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని రాహుల్‌ భావిస్తున్నారు.

దీనివల్ల అభ్యర్థుల ఎంపిక సత్వరం పూర్తవడంతోపాటు, వారు ఎన్నికల ప్రచారాన్ని ముందుగానే ప్రారంభించేందుకు కూడా సమయం దొరుకుతుందని తెలిపారు. అయితే, ముఖ్యమైన విధానపర నిర్ణయాల్లో కాంగ్రెస్‌ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పాత్ర కీలకంగా మారింది. కేరళ నుంచి లోక్‌సభకు ఎన్నికైన వేణుగోపాల్‌ అన్ని పీసీసీల్లోనూ సభ్యుడే. అదేవిధంగా కర్ణాటక పార్టీకి ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి కూడా. రానున్న లోక్‌సభ ఎన్నికలకు గెలిచే అభ్యర్థుల జాబితా తయారీతోపాటు, ఇతర వివరాలను ఇప్పటికే రాహుల్‌ గాంధీ తీసుకుంటున్నారని సమాచారం. కొన్ని రాష్ట్రాల్లో కుల సమీకరణాలు, బాగా పరిచయం ఉన్న వ్యక్తులు, వారి గెలుపోటములపై సొంతంగా సర్వేలు కూడా చేయించినట్లు తెలుస్తోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top