జాతీయ మీడియానూ బాబు మోసం చేశారు

Chandrababu was cheated by the national media - Sakshi

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మండిపాటు 

‘అనంత’లో కరువును జయించామని సీఎం అబద్ధాలు చెప్పారు 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడాన్ని ఖండించా.. 

మొత్తం ఎమ్మెల్యేలను కొనేసినా, ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే జగన్‌ ఒక్కరే అసెంబ్లీకి వెళ్లాలి 

నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తానన్నది జనవరి లేదా ఫిబ్రవరిలో వెల్లడిస్తా

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రెయిన్‌ గన్‌లతో రాష్ట్రంలో కరువును జయించామంటూ సీఎం చంద్రబాబు  జాతీయ మీడియాను కూడా మోసం చేశారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. అనంతపురం జిల్లాలో ఐదు రోజుల పర్యటన ముగింపు సందర్భంగా ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రాయలసీమలో కరువు లేదు, రైతులు సుభిక్షంగా, సంతోషంగా ఉన్నారంటూ చంద్రబాబు అబద్ధపు మాటలు చెప్పారని మండిపడ్డారు. నీళ్లు లేకుండా రేయిన్‌ గన్‌లతో పంటలను ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. కనీసం 10–25 ఏళ్ల సుదీర్ఘ ప్రణాళిక లేకపోతే రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని చెప్పారు. రాయలసీమ అంటే ముఠాల సంస్కృతి కాదన్నారు. ఈ ప్రాంతంలో చెరువులను కబ్జా చేశారని పేర్కొన్నారు. వాటికి పూర్వవైభవం తీసుకురావాలని ఆకాంక్షించారు. 

వైఎస్‌ జగన్‌ అసెంబ్లీకి వెళ్లాలి 
రాయలసీమ కరువుపై పాలక, ప్రతిపక్షాలు అసెంబ్లీలో చర్చించాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. తాము పాలసీల గురించి మాట్లాడుతుంటే ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాయలసీమపై, అనంతపురం జిల్లాపై అంత ప్రేమ ఉంటే అసెంబ్లీకి వెళ్లి చర్చించాలని చెప్పారు. ‘‘వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. అందుకని అసెంబ్లీకి వెళ్లబోమంటే ఎలా? ఎమ్మెల్యేలను కొనే నీచ సంస్కృతి రాజకీయ వ్యవస్థలో దశాబ్దాలుగా నాటుకుని ఉంది. టీడీపీ నేతలు మొత్తం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలను తీసుకెళ్లినా, ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే జగన్‌ ఒక్కరే అసెంబ్లీకి వెళ్లాలి. అప్పుడు రాష్ట్రం మొత్తం ఆయన వెనుక నడుస్తుంది. అప్పుడు మాకు ఆయనపై మాట్లాడే హక్కు ఉండదు. కానీ, అసెంబ్లీని బహిష్కరిస్తున్నాననడం సరైంది కాదు. చంద్రబాబు చేసింది నీచమైన పనే. మొదట్నుంచీ ఖండిస్తున్నా. చంద్రబాబు చేసింది తప్పు. అయినా జగన్‌ మొండిగా అసెంబ్లీకి వెళ్లి ఉంటే బాగుండేది’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

175 స్థానాల్లో పోటీ చేస్తాం 
వచ్చే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది జనవరి లేదా ఫిబ్రవరిలో స్పష్టం చేస్తామని పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. రాష్ట్రంలో 175 స్థానాల్లో బరిలో ఉంటామని తెలిపారు. తమ బలం తెలుసుకునేందుకు, యువత రాజకీయంగా బలపడేందుకైనా గెలుపోటములతో నిమిత్తం లేకుండా పోటీ చేస్తామన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top