బెదిరింపులతో సీనియర్లకు చెక్‌

Chandrababu Check for seniors with threats - Sakshi

  కేఈ, అయ్యన్న కుమారులకు సీట్లు కష్టమని చంద్రబాబు హెచ్చరిక

  గత్యంతరం లేక కాంగ్రెస్‌కు అనుకూలంగా స్వరం మార్చిన మంత్రులు

  కాంగ్రెస్‌తో పొత్తంటే ఉరేనని గతంలో విరుచుకుపడ్డ ఇద్దరు నేతలు

సాక్షి, అమరావతి: కాంగ్రెస్‌తో జతకట్టడాన్ని వ్యతిరేకిస్తున్న టీడీపీ సీనియర్‌ నాయకులను దారిలోకి తెచ్చేందుకు చంద్రబాబు బెదిరింపు మార్గాన్ని ఎంచుకున్నారు. ఎవరైనా తన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే రాజకీయ భవితవ్యం లేకుండా చేస్తానని హెచ్చరించడమేకాక అందుకు తగినట్లే పావులు కదుపుతున్నారు. తన సమకాలికుడు, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా ఉన్న మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కాంగ్రెస్‌ పొత్తుపై తమ వైఖరిని మార్చుకుని చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేయాల్సి రావడానికి బెదిరింపులే కారణమని తెలుస్తోంది. కాంగ్రెస్‌తో జట్టుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారని తెలిసి.. కొద్దిరోజుల క్రితం ఈ ఇద్దరు సీనియర్లు ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌తో పొత్తు ఉంటే తాను ఉరి వేసుకుంటానని చెప్పిన కేఈ.. తాజాగా చంద్రబాబు నిర్ణయానికి తాను సంపూర్ణ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్‌ టీడీపీని పెట్టారని, ఆ పార్టీతో కలిస్తే తమను ప్రజలు బట్టలు ఊడదీసి తంతారని చెప్పిన అయ్యన్న ఇప్పుడు మాట మార్చి కాంగ్రెస్‌తో పొత్తు తప్పుకాదని ప్రకటించారు. 

కుమారుల కోసం చంద్రబాబుకు జై..
ఈ ఇద్దరు సీనియర్లు మాట మార్చడం వెనుక చంద్రబాబు బెదిరింపు రాజకీయం ఉందని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేఈ.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని పేర్కొని తన కుమారుడు శ్యాంబాబును వారసుడిగా ప్రకటించారు. కానీ శ్యాంబాబుపై ఇసుక అక్రమ తవ్వకాలు, హత్య కేసు కోర్టు విచారణలో ఉన్నాయి. వీటిని సాకుగా చూపిన చంద్రబాబు.. శ్యాంబాబుకు బదులు కేఈ మరో సోదరుడు ప్రతాప్‌కు సీటిస్తానని పరోక్షంగా తన కోటరీ ద్వారా లీకులిప్పించారు. చంద్రబాబు వ్యూహం తెలిసిన కేఈ.. వెంటనే స్వరం మార్చారు. పార్టీ కంటె తన కుమారుడి రాజకీయ భవిష్యత్తే ప్రధానమని భావించి చంద్రబాబు నిర్ణయానికి మద్దతు ప్రకటించారని తెలుస్తోంది.

ఇక అయ్యన్నపాత్రుడిని సైతం చంద్రబాబు ఇలాగే కుటుంబ వ్యూహంలో ఇరికించారని చెబుతున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు విజయ్‌ను పోటీ చేయించడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే ఇటీవల ఆయనకు వ్యతిరేకంగా కుటుంబంలో రేగిన చిచ్చును చంద్రబాబు ఉపయోగించుకున్నారు. నర్సీపట్నం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా (ఆయన భార్య అనిత చైర్మన్‌) ఉన్న అయ్యన్న సోదరుడు సన్యాసిపాత్రుడితో విజయ్‌కు వ్యతిరేకంగా చంద్రబాబుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయించారు. సన్యాసిపాత్రుడిని చంద్రబాబు కోటరీ ప్రోత్సహించడంతోపాటు తన కొడుక్కి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయించడంతో అయ్యన్నకు వ్యూహం అర్థమై వెంటనే బాబుకు అనుకూలంగా స్వరం మార్చేశారని తెలుస్తోంది. ఇలా వారి కుటుంబాల్లో విభేదాలు సృష్టించి, బెదిరించి లొంగదీసుకున్నట్లు చర్చ నడుస్తోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top