రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర

Chandrababu and Lokesh Conspiracy against the AP government - Sakshi

చంద్రబాబు,లోకేష్‌ డైరెక్షన్‌లో విష ప్రచారం

సీఎం వైఎస్‌ జగన్, ఆయన కుటుంబ సభ్యులు,మహిళా ఎమ్మెల్యేలపై అసభ్యకరమైన పోస్టులు

హైదరాబాద్‌లోని ఎన్‌బీకే బిల్డింగ్‌లోనూ,టీడీపీ కార్యాలయాల్లోనూ సోదాలు చేయాలి

డీజీపీకి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, టీజేఆర్‌ సుధాకర్‌బాబు, ఉండవల్లి శ్రీదేవి ఫిర్యాదు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర జరుగుతోందని, ప్రతిపక్ష టీడీపీ అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు జోగి రమేష్, టీజేఆర్‌ సుధాకర్‌బాబు, ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. సీఎం వైఎస్‌ జగన్‌పైన, ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, మహిళా ఎమ్మెల్యేలపై సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టింగ్‌లు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్‌ను గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జోగి రమేష్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా చంద్రబాబులో మార్పు రాలేదని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్‌ల డైరెక్షన్‌లోనే సీఎం వైఎస్‌ జగన్‌ కుటుంబంపై సోషల్‌ మీడియాలో విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇందుకు వారిరువురే సూత్రదారులని.. అందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు.

చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా?
ఉండవల్లి శ్రీదేవి మాట్లాడుతూ.. అసెంబ్లీలో కూర్చున్న వైఎస్సార్‌సీపీ మహిళా ఎమ్మెల్యేల ఫొటోలతో సోషల్‌ మీడియాలో టీడీపీ వాళ్లు అసభ్య పోస్టింగ్‌లు పెట్టారని ఆరోపించారు. ఎన్నికల సమయంలో తనపై టీడీపీ వాళ్లు దాడిచేశారని, ఎమ్మెల్యే అయ్యాక వినాయక ఉత్సవాల్లో కులం పేరుతో దూషించి తీవ్రంగా అవమానించారని ఆవేదన వ్యక్తంచేశారు. చంద్రబాబు ఇంట్లో మహిళలు లేరా? వారికి ఇటువంటి అవమానాలు జరిగితే ఊరుకుంటారా? అంటూ ఆమె ప్రశ్నించారు.

ఎన్‌బీకే, టీడీపీ ఆఫీసుల్లోనే కుట్ర
వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏ మంచి పనిచేసినా విమర్శించడమే పనిగా టీడీపీ పెట్టుకుందని మరో ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌కు వ్యతిరేకంగా హైదరాబాద్‌లోని నందమూరి బాలకృష్ణ (ఎన్‌బికే) భవనం, టీడీపీ కార్యాలయం, గుంటూరులోని టీడీపీ కార్యాలయాల్లో కుట్ర జరుగుతోందన్నారు. వీటిల్లో సోదాలు నిర్వహించాలని డీజీపీ సవాంగ్‌ను కోరినట్లు చెప్పారు. ఈ విషయంలో చంద్రబాబు బహిరంగ చర్చకు వస్తే వారి కుట్రలను ఆధారాలతో సహా నిరూపిస్తామన్నారు. అందుకు ఆయన ఎక్కడకు రమ్మంటే అక్కడకు వస్తామని సుధాకర్‌ సవాల్‌ విసిరారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top