బిహార్‌ ఎన్నికల్లో ‘సీఏ’ సేవలు నిజం

Cambridge Analytica Roll In Bihar Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఐదు కోట్ల మంది ఫేస్‌బుక్‌ ఖాతాదారుల వివరాలను వారి అనుమతి లేకుండా సేకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ) భారత ఎన్నికల్లో కూడా ఆ వివరాలను ఉపయోగించుకుందా? అసలు భారత్‌ ఎన్నికల్లో తన సేవలను అందించిందా? సేవలు ఉపయోగించుకున్నట్లు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు పరస్పరం చేసుకుంటున్న విమర్శల్లో నిజం ఎంత ?
2010లో బిహార్‌కు జరిగిన ఎన్నికల్లో తన సేవలను అందించినట్లు కేంబ్రిడ్జి అనలిటికా స్వయంగా తన వెబ్‌సైట్‌లోనే వెల్లడించింది. లండన్‌ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ సంస్థ వాస్తవానికి అప్పటికి పుట్ట లేదు. కాకపోతే తన మాతృ సంస్థ ‘ది స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్స్‌ లాబరేటరీస్‌ గ్రూప్‌’ ద్వారా ఈ ఎన్నికల సేవలో పాల్గొంది. 2013లో కేంబ్రిడ్జి అనలిటికా ఏర్పాటయింది. ‘బిహార్‌ ఎన్నికల్లో మా క్లైంట్‌ అఖండ విజయం సాధించారు. మేం టార్గెట్‌ చేసిన సీట్లలో 90 శాతం సీట్లను గెలుచుకున్నాం’ అని కేంబ్రిడ్జి అనలిటికా ప్రకటించుకుంది.

2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితీష్‌ కుమార్‌ నాయకత్వంలోని జనతా దళ్‌ (యూ) ఐదింట నాలుగొంతుల సీట్లను సాధించడం ద్వారా అఖండ విజయం సాధించింది. అమష్‌ త్యాగికి చెందిన ఓవ్లీన్‌ బిజినెస్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థను స్థానిక భాగస్వామిగా పెట్టుకొని నాడు ‘ది స్ట్రాటజిక్‌ కమ్యూనికేషన్స్‌ లాబరేటరీస్‌ గ్రూప్‌’ బీహార్‌ ఎన్నికల్లో తన సేవలను అందించింది. అందుకు కారణం అమష్‌ త్యాగి, జేడీయూ సీనియర్‌ నాయకుడు కేసీ త్యాగి కుమారుడు అవడమే.

ఫేస్‌బుక్‌ ఖాతాదారుల సమాచారాన్ని ‘ప్రిడిక్టివ్‌ అనలటిక్స్, బిహేవియరల్‌ సైన్స్‌’తో విశ్లేషించి సీఏ సంస్థ ఖాతాదారుల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటుంది. అంటే, ఫేస్‌బుక్‌ ఖాతాదారుల్లో ఏ ఓటరు ఏ రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు? ఎందుకు చూపుతున్నారు? ఏ పార్టీకి ఓటు వేయాలన్న విషయంలో ఎవరు ఇంకా సందిగ్ధంలో ఉన్నారు? అన్న అంశాలను పసిగట్టి వారిని లక్ష్యంగా చేసుకొని సీఏ లాంటి సంస్థలు తమ క్లైంట్‌కు సానుకూలంగా ఓటరు మలుచుకుంటాయి.

ఇదే సూత్రం ఆధారంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ పక్షాన పనిచేసి ఆయన్ని గెలిపించామని సీఏ తన వెబ్‌సైట్‌లో గర్వంగా ప్రకటించుకుంది. ఆ ఎన్నికల ప్రచారంలో తాను కూడా పాల్గొన్నానని, కేవలం భారతీయుల లక్ష్యంగానే తాను పనిచేశానని అమష్‌ త్యాగి మీడియాకు తెలిపారు. 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సీఐ తన సేవలను అందించేందుకు ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్‌ పార్టీతోని గత కొంతకాలంగా చర్చలు జరుపుతూ వచ్చిందని తెల్సిందే. అయితే ఏ పార్టీతోని కూడా ఇంతవరకు ఒప్పందం కుదరలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 13.5 కోట్ల మంది కొత్త ఓటర్లు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అలాంటి వారిని తాము తేలిగ్గా ప్రభావితులను చేయగలమని సీఏ సంస్థ నిర్వాహకులు తెలియజేస్తున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top