
సాక్షి, విజయవాడ : పవన్ కళ్యాణ్ అధికారపార్టీని వదిలి.. ప్రతిపక్షాన్ని విమర్శించడం దారుణమని.. ప్యాకేజీకి అమ్ముడుపోవడమే పౌరుషమా అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య నిలదీశారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పవన్‌ను నమ్మి పార్టీలో చేరినవారు ప్రస్తుతం తలలు పట్టుకుంటున్నారని అన్నారు. ఆరు నెలల కిందట చంద్రబాబు,లోకేష్‌ల అవినీతిపై మాట్లాడిన పవన్.. ప్రస్తుతం ప్రతిపక్షంపై విమర్శలు చేయటం దారుణమన్నారు. ప్యాకేజీలు పవన్ వల్లే ప్రాచుర్యంలోకి వచ్చాయని, చంద్రబాబుతో లాలూచీ పడటమే పౌరుషమా అని ప్రశ్నించారు.
వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే.. ఫ్యాక్షన్ వస్తుందని ప్రజలను భయపెడుతున్నారని, 2004లో కూడా వైఎస్సార్‌పై ఇలానే దుష్ప్రచారం చేశారని, కానీ వైఎస్ అధికారంలోకి వచ్చాక సంక్షేమ రాజ్యాన్ని ప్రజలకు అందించారని గుర్తుచేశారు. వైఎస్ వచ్చాకే రైతుల కష్టాలు తొలగిపోయాయని, చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తనకు ఉపయోగపడే పథకాలు మాత్రమే అమలు చేశారని విమర్శించారు. మళ్లీ ఇప్పుడు జగన్ అధికారంలోకి వస్తే.. ఫ్యాక్షన్ వస్తుందని ప్రజలను భయపెడుతున్నారని..చంద్రబాబు లాంటి వ్యక్తి మళ్లీ సీఎం అయితే రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్లిపోతుందన్నారు. కేసీఆర్‌పై విమర్శలు చేసే చంద్రబాబు ఎందుకు తెలంగాణలో పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ కార్యాలయం బోపిపోయిందని, ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని హైదరాబాద్ నుంచి అమరావతికి పారిపోయి వచ్చి.. అక్కడ టీడీపీని చాపచుట్టేలా చేశారని విమర్శించారు.
టీడీపీతో పొత్తు పెట్టుకుని అక్కడ కాంగ్రెస్ కూడా అస్థిత్వం కోల్పోయిందని, డిలిమినేషన్ కోసం కేంద్రంతో తగాదా పెట్టుకున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదంటూ ఆరోపించారు. పొరుగు రాష్ట్రం, కేంద్రంతో తగాదా పెట్టుకుంటే.. ఏపీ ఎలా అభివృద్ది చెందుతుందని దుయ్యబట్టారు. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరగుతోందని, రాష్ట్రానికి మేలు జరగాలంటే.. చంద్రబాబు ఓటమి తప్పదని అన్నారు. యువతకు ఉపాధి, పారిశ్రామిక అభివృద్ది, అవినీతి తగ్గాలన్నా, రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సక్రమంగా నడవాలన్నా చంద్రబాబును ఓడించి తీరాలన్నారు.