బీజేపీ కంటే మోదీకే పాపులారిటీ: రాం మాధవ్‌

BJP National General Secretary Ram Madhav Slams Opposition Parties In Delhi - Sakshi

ఢిల్లీ: ప్రజలందరూ పదే పదే మోదీ సర్కార్‌ రావాలని కోరుకుంటున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ వ్యాఖ్యానించారు. ఢిల్లీలో తెలుగు వారి ఓటర్‌ అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ ఏపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, ఇతర బీజేపీ నేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాం మాధవ్‌ మాట్లాడుతూ..కాశ్మీర్‌లో ఆజాద్‌ హిందూస్తాన్‌... నరేంద్ర మోదీ జిందాబాద్‌ అని నినాదాలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ ప్రాబల్యం లేని చోట కూడా నరేంద్ర మోదీకి ప్రజాదరణ ఉందన్నారు. వాస్తవంగా బీజేపీ కంటే నరేంద్ర మోదీకే ఎక్కువ పాపులారిటీ ఉందని చెప్పారు.

‘దేవెగౌడ ప్రధాని అయినప్పుడు తామెందుకు ప్రధాని కాలేరని చిన్న పార్టీల నేతలు కలలు కంటున్నారు. ఏపీ, తెలంగాణ సీఎంలు కింగ్‌మేకర్‌లు  కావాలని కలలు కంటున్నారు. మావద్ద కింగే ఉన్నప్పుడు కింగ్‌ మేకర్‌ అవసరం లేదు. మే 23న ఫలితం ఏమిటనేది ప్రజలందరికీ ఇప్పటికే తెలుసు. 2014లో బీజేపీకి 225 కంటే ఎక్కువ రావని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ మా ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ వచ్చింది. ఈ సారి కూడా నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి మెజారీటీతో గెలవడం ఖాయమ’ని వ్యాఖ్యానించారు.

‘తాము అధికారంలోకి వస్తే రూ.72 వేలు ఇస్తామని రాహుల్‌ గాంధీ అంటున్నారు. మరి 70 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఏం చేశారు. నరేంద్ర మోదీ ఉచితంగా ఏదీ ఇవ్వలేదు. డబ్బున్న వ్యక్తికి, లేని వ్యక్తికీ సమానమైన చికిత్స అందించాలని ఉద్దేశంతోనే ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని తీసుకువచ్చారు. ఆ పథకంతో టైర్‌-2 సిటీల్లో కూడా మంచి ఆసుపత్రులు వస్తున్నాయి. ప్రజలు బిచ్చగాళ్లు కాదు..వారికి గౌరవప్రదమైన జీవితం ఇవ్వాలనేదే మోదీ ప్రభుత్వ ఉద్దేశమ’ని చెప్పారు.

‘దేశంలో 9 కోట్ల మరుగుదొడ్లు కట్టించి మహిళల ఆత్మగౌరవం నిలబెట్టారు. ఎస్సీ, ఎస్టీలకు గ్యారంటీ లేకుండా రూ.15 లక్షల అప్పు ఇచ్చే ముద్ర యోజన పథకాన్ని తీసుకువచ్చాం. ఉద్యోగాల కోసం వెతికిన వాళ్లు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగారు. ప్రపంచ దేశాల్లో భారతీయులు తలెత్తుకుని బతికేలా గౌరవాన్ని పెంచారు. ప్రతి రంగంలోనూ నరేంద్ర మోదీ తనదైన ముద్రవేశారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌లకు ఆధారాలు కావాలంటే మిగ్‌ విమానాలకు కట్టేసి తీసుకెళ్లాలా..? భారత్‌ సమర్పించిన ఆధారాల కారణంగానే ఐక్యరాజ్య సమితి, మసూద్‌ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు. దొంగే దొంగ అన్నట్లుగా.. చౌకీదార్‌ చోర్‌ అంటున్నారు. నరేంద్ర మోదీ అవినీతిరహిత వ్యక్తి. అవినీతిపరులు దేశం వదిలిపారిపోయే పరిస్థితి వచ్చింది. ప్రజలందరి హృదయాల్లో నరేంద్ర ఉన్నార’ని కొనియాడారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top