‘ఆపరేషన్‌ గరుడ’ అంటూ దిగజారొద్దు..

BJP MLC Madhav Responds To Operation Garuda Comments - Sakshi

సాక్షి, విశాఖపట్టణం : చమురు సంబంధ ఉత్పత్తులు పెట్రోల్‌, డీజిల్‌ తదితరాలను వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కిందకు తేవాలని అధిష్టానాన్ని ఆంధ్రప్రదేశ్‌ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకులు కోరినట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ మాధవ్‌ వెల్లడించారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘ఆపరేషన్ గరుడ’ అంటూ హీరో శివాజీ చేస్తున్న ఆరోపణలపై స్పందించారు. చంద్రబాబు ఇలాంటి ఆరోపణలతో తన స్థాయిని మరింత దిగజార్చుకుంటున్నరాని మండిపడ్డారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు ముందు ఒక్కసారి కూడా పోలవరం ప్రాజెక్టు ఊసెత్తని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఆ ప్రాజెక్టును గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వైఎస్సార్‌ హయాంలోనే ప్రాజెక్టు ముందుకు కదిలిందని చెప్పారు. పోలవరం జాప్యానికి టీడీపి వ్యవహార ధోరణియే కారణమని పేర్కొన్నారు.

నవ నిర్మాణ దీక్షను ప్రభుత్వ ఖర్చుతో చేస్తూ పార్టీ ప్రచారం కార్యక్రమంగా మలుచుకుంటున్నారని ఆరోపించారు. విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతం అంటూ ఏపీకి ఏం కావాలో అడగని టీడీపీ నాయకులు ఇప్పుడు దీక్షలు ఎలా చేస్తారు? అంటూ నిలదీశారు. నిరుద్యోగులకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది ఎన్నికల భృతి అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. త్రిపుల్ తలాక్‌పై టీడీపీ అనుకూలమా? వ్యతిరేకమో? చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top