‘వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ పాలనను గుర్తు చేస్తున్నారు’

Balineni Srinivas Reddy Avanti Srinivas And Dharmana krishna Das Press Meet After Taking Charge - Sakshi

సాక్షి, అమరావతి : దివంగత నేత వైఎస్సార్‌ పాలనను ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేస్తున్నారని మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. గురువారం సచివాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత సమర్థవంతమైన పాలనను అందిస్తున్నారని, అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని అన్నారు. మంత్రి వర్గంలో అన్ని వర్గాలవారికి సముచిత స్థానం కల్పించారన్నారు. ఐదుగురికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం ఓ చరిత్ర అని తెలిపారు. రోడ్లు, భవనాల శాఖ అత్యంత కీలకమైనవని, అందరినీ కలుపుకుని పనిచేస్తానని అన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన అనంతపురం-అమరావతి ఎక్స్‌ప్రెస్‌ రోడ్డుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 


నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అవంతి శ్రీనివాస్‌ అన్నారు. పర్యాటక శాఖమంత్రిగా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తనకు ఈ అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలను తెలిపారు. రాబోయే రోజుల్లో టూరిజాన్ని అభివృద్ది చేస్తానని హామి ఇచ్చారు. అతిథి దేవోభవ అనే నినాదంతో ముందుకు వెళ్తామన్నారు. 13జిల్లాలో ఉన్న టూరిజం స్పాట్లను అభివృద్ది చేస్తామని తెలిపారు. సింగిల్‌ విండో పద్దతిలో అనుమతులిస్తామని వివరించారు. ఏపీ టూరిజంకు బ్రాండ్‌ అంబాసిడర్‌ను నియమిస్తామన్నారు. ఏపీకి వచ్చే టూరిస్టులకు అన్ని విధాలుగా భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. రేవు పార్టీలు, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

ఎర్రచందనం అక్రమరవాణా అరికడతాం..
విద్యుత్‌, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి గురువారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎర్రచందనం అక్రమరవాణాను అరికడతామన్నారు. పగటి పూట రైతులకు విద్యుత్‌ సరఫరా చేసే దిశగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆక్వా రైతులకు ఇచ్చే విద్యుత్‌ రాయితీలను పొడగిస్తున్నామని ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లను ఉచితంగా ఇస్తామని హామి ఇచ్చారు. ఐదువేల ఎర్ర చందనం వేలం వేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. విద్యుత్‌ టారిఫ్‌లు, పీపీఏలను సమీక్షిస్తామని అన్నారు. కేంద్రం సమీక్షించవద్దన్న విషయాన్ని సీఎం జగన్‌.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లారని తెలిపారు. తప్పులుంటే సమీక్షిస్తామని ప్రధానికి సీఎం వివరించినట్లు తెలిపారు.

ఫిట్‌నెస్‌ లేకుంటే.. బస్సులు సీజ్‌
బస్సుల ఫిట్‌నెస్‌ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చాలా సీరియస్‌గా ఉన్నారని, ఫిట్‌నెస్‌ లేని బస్సులను సీజ్‌ చేస్తామని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని హెచ్చరించారు. గురువారం సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఫిట్‌నెస్‌ లేని స్కూల్‌ బస్సులకు ఇవాళ సాయంత్రం వరకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ఇదొక సూచనలాంటి హెచ్చరిక అని, సాయంత్రంలోగా ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ను తీసుకోకుంటే.. బస్సులను సీజ్‌ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఫిట్‌నెస్‌ లేకుండా బస్సులను నడుపుతామంటే సహించేంది లేదని అన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఫిట్‌నెస్‌ లేని బస్సల వివరాలు ఇవ్వాలని కోరారు.

ప్రభుత్వానికి, పార్టీకి మంచిపేరు తెచ్చేలా పనిచేస్తా..
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనపై ఎంతో నమ్మకం ఉంచి మంత్రి బాధ్యతలు అప్పగించారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం సచివాలయంలో గ్రామీణ, పంచాయతీ రాజ్‌, మైనింగ్‌ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌కు, ప్రభుత్వానికి, పార్టీకి మంచి పేరు తెచ్చేలా పనిచేస్తానని అన్నారు. వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చే ఎన్నికలకు వెళ్తామని అన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top