
సాక్షి, విజయవాడ : పోలవరం ప్రాజెక్టు మొదలు అన్నిపనుల్లో ప్రజలను మోసం చేస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వేస్ట్ ఫెలో అని ఏపీసీసీ చీఫ్ రఘువీరా విమర్శించారు. పొలవరం ప్రాజెక్టు పనులు చేసేవాళ్లంతా బాబు బినామీలేనని ఆరోపించారు. విజయవాడలో సోమవారం విలేకరులతో మాట్లాడిన ఆయన.. 2019 కల్లా పోలవరం పూర్తి చేయకపోతే ఓట్లు అడిగే హక్కు చంద్రబాబుకు ఉండబోదన్నారు.
‘‘చంద్రబాబు ఒక వేస్ట్ ఫెలో. ఆడలేక మద్దెల ఓడు సామెత చందంగా తాను అధికారంలో ఉండి మాపై(కాంగ్రెస్ పార్టీపై) విమర్శలు చేయడమేంటి? సదావర్తి భూముల విషయంలో టీడీపీ ప్రభుత్వం ఏకంగా కోర్టులనే తప్పు పట్టించాయి. ఈ విషయాన్ని గుర్తించి కోర్టు చివాట్లు పెట్టినా సీఎం తుడుచుకుని పోతున్నారు’’ అని రఘువీరా వ్యాఖ్యానించారు.
ఏపీ కాంగ్రెస్ నాయకత్వం త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శించి, అక్కడ జరుగుతోన్న వ్యవహారాన్ని పరిశీలించి, నిజానిజాలను ప్రజల ముందు ఉంచుతామని రఘువీరా చెప్పారు. విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన హామీలను తేవడంలో సీఎం చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ప్రత్యేక హోదా అంశంలో ప్రజలను ప్రభుత్వాలు మోసం చేశాయన్నారు. తమిళనాడు ప్రభుత్వంతో సదావర్తి భుముల విషయంలో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. , ,