పరకాల ప్రభాకర్ రాజీనామా

Andhra Pradesh Govt Advisor Parakala Prabhakar Quits - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మీడియా సలహాదారు పదవికి పరకాల ప్రభాకర్‌ మంగళవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పంపారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరారు. ఎన్డీయే నుంచి వైదొలగినట్టు పైకి ప్రకటించినప్పటికీ అంతర్గతంగా బీజేపీకి చెందిన పలువురు సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న చంద్రబాబు తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విమర్శల నేపథ్యంలోనే త్వరలో పదవీ కాలం ముగుస్తున్న పరకాలతో రాజీనామా చేయించినట్టు చెబుతున్నారు. జూలై మొదటి వారంతో పరకాల పదవీ కాలం పూర్తి కానుంది. అయితే, ప్రతిపక్షం నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో తాను పదవికి రాజీనామా చేస్తున్నట్టు పరకాల తన లేఖలో పేర్కొన్నారు.

తాను ప్రభుత్వంలో కొనసాగడం వల్ల రాష్ట్ర హక్కుల సాధనకు భంగం వాటిల్లకూడదన్న ఉద్దేశంతో రాజీనామా చేసినట్టు పరకాల తెలిపారు. తన కుటుంబంలోని వ్యక్తులు వేరొక పార్టీలో ఉండటం, అందులోనూ తనకన్నా భిన్నమైన రాజకీయ అభిప్రాయాలు కలిగి ఉన్నందున, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాను రాజీపడతానని కొందరు ప్రచారం చేస్తున్నారన్నారు. ఆ ప్రచారం నేపథ్యంలోనే  సలహాదారు పదవిని వదులుకుంటున్నట్టు లేఖలో పేర్కొన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు.

బాబు రాజకీయం?
కేంద్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం నుంచి టీడీపీ వైదొలగినప్పటికీ తెరవెనుక బీజేపీ నేతలతో సంబంధాలు కొనసాగిస్తున్న చంద్రబాబు నాయుడు తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీ ప్రభుత్వంలోని ఇద్దరు బీజేపీ మంత్రులు చంద్రబాబు కేబినెట్‌ నుంచి వైదొలగినప్పటికీ పరకాలను చంద్రబాబు కొనసాగించారు. నాలుగేళ్ల పాటు పరకాల ప్రభుత్వంలో కొనసాగుతూ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించారు. చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా కొనసాగుతున్న పరకాల టీడీపీలో చేరాలని కొంతమంది సూచించినప్పటికీ బీజేపీ నేతలతో ఉన్న సంబంధాల దృష్ట్యా ఆవిషయంపై  చంద్రబాబు ఎప్పుడూ ఒత్తిడి చేయలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇంతకాలం సాఫీగానే సాగినప్పటికీ పరకాల సతీమణి నిర్మలా సీతారామన్‌ కేంద్ర మంత్రి పదవిలో ఉండటం, చంద్రబాబు తెరవెనుక కొందరు సీనియర్ బీజేపీ నేతలతో సంబంధాల కొనసాగించడం వంటి చర్యలపై  విపక్షాలు వేలెత్తి చూపేలా చేసింది. ఆ కోణంలోనే, రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీపై యుద్ధం చేస్తామంటూనే చంద్రబాబు.. పరకాలను మీడియా సలహాదారుగా కొనసాగించడం, మహారాష్ట్ర బీజేపీ మంత్రి సతీమణిని టీటీడీ బోర్డులో సభ్యురాలిగా నియమించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విమర్శల నేపథ్యంలో పరస్పర అవగాహన మేరకు తాజా పరిణామం చోటుచేసుకున్నట్టుగానే టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

కొసమెరుపు:
పదవీ కాలం పూర్తవడానికి 15 రోజుల ముందు పరకాల ప్రభాకర్‌ రాజీనామా చేయడం చేయడం విశేషం. జూలై 5తో ఆయన పదవీ కాలం పూర్తికానుంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top