వీరి బొమ్మ హిట్టా.. ఫట్టా?

10 actors in Karnataka elections - Sakshi

కర్ణాటక ఎన్నికల బరిలో 10 మంది నటులు

సాక్షి, బెంగళూరు: పలువురు సినీ ప్రముఖులు కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. మంత్రి ఉమాశ్రీ, జగ్గేశ్, సాయికుమార్, శశికుమార్, బీసీ పాటిల్, సీపీ యోగేశ్వర్, మధు బంగారప్ప, కుమార బంగారప్ప, నిర్మాత కుమారస్వామి, సీఆర్‌ మనోహర్, మునిరత్న నాయుడు తదితరులు వీరిలో ఉన్నారు. వీరి రాజకీయ చిత్రం హిట్‌ అవుతుందా..? తుస్సుమంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

► సీనియర్‌ నటి, ప్రస్తుత మంత్రి ఉమాశ్రీ కాంగ్రెస్‌ టికెట్‌పై తెరదాళ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గతంలోనూ ఆమె పోటీ చేసి విజయం సాధించారు.

► తెలుగు వారికి ఎంతో సుపరిచితుడయిన నటుడు సాయికుమార్‌. ఆయన బీజేపీ తరఫున తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న బాగేపల్లి నుంచి బరిలో ఉన్నారు.

► మాజీ ముఖ్యమంత్రి ఎస్‌.బంగారప్ప ఇద్దరు కుమారులు కుమార బంగారప్ప, మధు బంగారప్పలు కూడా పలు కన్నడ చిత్రాల్లో హీరోలుగా రాణించారు. ప్రస్తుతం కుమార బీజేపీ నుంచి, మధు జేడీఎస్‌ పార్టీల నుంచి సొరబ నియోజకవర్గంలో ముఖాముఖి తలపడుతుండటం విశేషం.

► ప్రముఖ నటుడు శశికుమార్‌ కాంగ్రెస్‌ టికెట్‌పై మాళకాల్మురు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే, కాంగ్రెస్‌ ఆయనకు టికెట్‌ నిరాకరించడంతో ఇటీవలే జేడీఎస్‌ తీర్థం పుచ్చుకుని, హోసదుర్గలో బరిలో దిగారు.

► గతంలో ఎమ్మెల్సీగా పనిచేసిన నటుడు జగ్గేశ్‌ ప్రస్తుతం బెంగళూరు యశ్వంతపుర నుంచి బీజేపీ టికెట్‌పై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సినిమా రంగంలో వొక్కళిగ వర్గానికి చెందిన వాడు కావడంతో ఆ వర్గం ఓటర్లను బాగానే ప్రభావితం చేయగలరని బీజేపీ ఆశిస్తోంది.

► నటుడు బీసీ పాటిల్‌ కాంగ్రెస్‌ తరఫున హిరేకెరూరు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇక్కడే ఓటమి పాలయ్యారు. దీంతో ఈ సారి ఎలాగైనా గెలిచి తీరాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు.

► నటుడు, రాజకీయ నేత సీపీ యోగేశ్వర్‌ చన్నపట్టణ నియోజవర్గం నుంచి జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామిపై పోటీలో దిగారు.

► చలన చిత్ర రంగం, టీవీ సీరియల్‌లలో నటునిగా పేరు పొందిన నె.ల.నరేంద్ర బాబు ఈసారి బీజీపీ అభ్యర్థిగా మహాలక్ష్మి లేఔట్‌లో పోటీ చేస్తున్నారు. గతంలో రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు.  

► సినీ నిర్మాత మునిరత్న నాయుడు రాజరాజేశ్వరి నగర్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ టికెట్‌తో పోటీ చేస్తున్నారు.

► అయితే, రెబెల్‌ స్టార్‌ అంబరీష్‌ ఆశ్చర్యకరంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top